World Environment Day: మీకిది తెలుసా.. పీపీఈ కిట్ భూమిలో కలవాలంటే 500 ఏళ్ళు!

మనిషి తాను సౌకర్యంగా బ్రతికే క్రమంలో తన నాశనాన్ని తానే కోరుకుంటున్నాడు. ఈ భూమ్మీద మనుషులే కాదు అసలు జీవం ఉండాలంటే పర్యావరణం ముఖ్యం. కానీ అలాంటి పర్యావరణనాన్ని ఎవరికి వారు స్వార్ధానికి నాశనం చేస్తుంటే..

World Environment Day: మనిషి తాను సౌకర్యంగా బ్రతికే క్రమంలో తన నాశనాన్ని తానే కోరుకుంటున్నాడు. ఈ భూమ్మీద మనుషులే కాదు అసలు జీవం ఉండాలంటే పర్యావరణం ముఖ్యం. కానీ అలాంటి పర్యావరణనాన్ని ఎవరికి వారు స్వార్ధానికి నాశనం చేస్తుంటే.. భావితరాలకు ముప్పుగా మారుతుంది. పర్యావరణాన్ని నాశనం చేసే వాటిలో మొదటిది ప్లాస్టిక్. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం తీవ్రంగా కలుషితమవుతుందని ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిన నిజమే. ప్రతి ఏడాది రకరకాల కార్యక్రమాలు నిర్వహించి.. ఎన్నెనో ఒప్పందాలు చేసుకొని ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంటారు. కానీ అవి ఎంతవరకు అమలవుతున్నాయంటే సమాధానం దొరకడం కష్టమే.

మన పర్యావరణాన్ని మనం చేజేతులా ఎలా నాశనం చేసుకుంటున్నామో చెప్పే చిన్న ఉదాహరణ కరోనా నుండి రక్షణకు వాడే పీపీఈ కిట్. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందితో పాటు కరోనా నుండి రక్షణ పొందాలని భావించిన ప్రతి ఒక్కరూ ఈ మధ్య కాలంలో పీపీఈ కిట్స్ ఉపయోగించిన సంగతి తెలిసిందే. అయితే.. వాటిని ఎంత జాగ్రత్త కోసం ఉపయోగించారో అంతే జాగ్రత్తగా దానిని నాశనం చేయాల్సి ఉంటుంది. లేదంటే పర్యవసానాలు లెక్కకు మించి ఉంటున్నాయి. పీపీఈ కిట్ భూమిలో కరిగిపోవాలంటే సుమారుగా 500 ఏళ్ళు పడుతుందట. అంటే దానిని ఉపయోగించిన వారు మాకెందుకులే అని బయట విసిరేస్తే అది భూమిలో కరిగేది 500 ఏళ్ళకి అనమాట.

ఇప్పుడు విరివిగా వినియోగిస్తున్న సింగిల్ యూజ్‌ పీపీఈ కిట్లు పాలీప్రోపోలీన్‌తో త‌యార‌వుతున్నాయి. వీటిలో 85 శాతం పాలీప్రోపోలీన్, 10 శాతం పాలీకార్బోనేట్‌, 4 శాతం ర‌బండ్‌, ఒక శాతం అల్యూమినియం ఉంటాయి. ప్ర‌స్తుతం మ‌న దేశంలో నిత్యం 5 ల‌క్ష‌ల పీపీఈ కిట్లు తయారవుతుండగా ఇవన్నీ వాడిన తర్వాత మెడికల్ వేస్ట్ దిబ్బగా తయారవుతుంది. వీటితో పాటు శానిటైజర్ డబ్బాలు, ప్లాస్టిక్ హ్యాండ్ గ్లౌజ్లు, హెడ్ అండ్ షూ కవర్లు ఇలా ఎన్నో మెడికల్ వెస్ట్ కలిసి భారీ ఎత్తున పేరుకుపోతుంది. పీపీఈ కిట్ ను శాస్త్రీయ పద్ధతిలో కాల్చినా దాని నుంచి 3,816 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. దీనిని గ్రహించడానికి ఒక‌ చెట్టుకు 182 రోజులు పడుతుంది. కానీ ఆ చెట్లను కూడా లేకుండా చేసుకుంటున్నాం.

కరోనా తర్వాత ఎక్కడ చూసినా ఈ మెడికల్ వేస్ట్ మనకి కనిపిస్తూనే ఉంది. ప్రభుత్వాలు, పారిశుధ్య కార్మికులు వాటిని ఎంత సేకరించి రీసైక్లింగ్ చేసినా రోజూ ఎంతోకొంత మెడికల్ వెస్ట్ నదులు, సముద్రాలు, భూమిలో కలుస్తూనే ఉంది. ప్లాస్టిక్ కవర్లను చుట్టే గంగా, యమునా నదిలో శవాలను విసిరేశారు. సాధారణంగానే రోజువారీ ప్లాస్టిక్ పర్యావరణాన్ని దెబ్బతీస్తుండగా కరోనాతో ఏర్పడిన మెడికల్ వెస్ట్ ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారుతుంది. మనకి మనల్ని రక్షించుకుంటూ.. మన సౌకర్యం కోసం పరితపిస్తూ.. మన జీవన శైలిలో నాగరికత అనే మోజులోపడి.. మనకి తెలిసి కూడా మనమే పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం. దాని పర్యవసానాలను తిరిగి మనమే అనుభవిస్తున్నాం.

ట్రెండింగ్ వార్తలు