Samatha Kumbh 2023 Dolotsavam: సమతా కుంభ్‌ లో కనులపండువగా డోలోత్సవం

Samatha Kumbh 2023 Dolotsavam: ముచ్చింతల్‌లో సమతా కుంభ్‌ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆరో రోజు డోలోత్సవం కనులపండువగా సాగింది.

Samatha Kumbh 2023 Dolotsavam: ముచ్చింతల్‌లో సమతా కుంభ్‌ అంగరంగ వైభవంగా జరుగుతోంది. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల బ్రహ్మత్సవాల నిత్య కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజు డోలోత్సవం కనులపండువగా సాగింది. సమతా సన్నిధిలో భక్తజనం ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు నిర్వహించారు.

హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లో సమతా కుంభ్‌ 2023 వైభవోపేతంగా జరుగుతోంది. ఆరో రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. నిత్య కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం 5 గంటల 45 నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవ జరిగింది. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ ఆధ్వర్యంలో అష్టాక్షరీ మంత్రజపం జరిగింది. భక్తులంతా అరగంటపాటు ధ్యానం చేశారు. ఆ తర్వాత ఆరాధన, సేవాకాలంలో భాగంగా శాత్తుముఱై జరిపించారు. అనంతరం తీర్థ, ప్రసాద గోష్టిలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా చినజీయర్‌ స్వామివారు తీర్థం అనుగ్రహించారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు పూర్ణాహుతి, బలిహరణ జరిగింది.

విశేష ఉత్సవంలో భాగంగా డోలోత్సవం కనులపండువగా జరిగింది. డోలోత్సవాన్ని దర్శిస్తే గృహ దోషాలు తొలగిపోతాయని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి అన్నారు. ముందుగా చతుర్వేద పారాయణం, తర్వాత సంకీర్తనం పాడారు. అర్చక స్వాములు, జీయరు స్వాములు పెరుమాళ్లకు ఊయలలు ఊపారు. భక్తులందరితో పెరుమాళ్లకు ఊయలలూపే భాగ్యాన్ని శ్రీశ్రీశ్రీ స్వామివారు అనుగ్రహించారు. ఆ తర్వాత స్వామికి ఉపచారం ఇచ్చి నాలుగు వేద పారాయణాలు చేసి స్వామివారిని నిద్రపుచ్చారు.

Also Read.. Samatha Kumbh 2023: వైభవోపేతంగా సమతా కుంభ్‌ విశేష ఉత్సవం

ఇక సాయంత్రం సమతా సన్నిధిలో చిన్నారుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. 5 గంటల నుంచి 45 నిమిషాల పాటు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం జరిగింది. ఆరున్నర గంటలకు సాకేత రామచంద్రస్వామి 18 దివ్యదేశ మూర్తులు 18 గరుడలపై యాగశాల ప్రవేశం చేశారు. రాత్రి 7 గంటల నుంచి సాకేత రామచంద్ర ప్రభువుకు హనుమద్వాహన సేవతో పాటు 18 దివ్యదేశాధీశులకు గరుడ సేవలు నిర్వహించారు. అనంతరం నిత్యాపూర్ణాహుతి నిర్వహించారు. రాత్రి 9 గంటలకు తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆరో రోజు సమతా కుంభ్‌ కార్యక్రమాలు ముగిశాయి.

ట్రెండింగ్ వార్తలు