Supreme Court on Buldozer Action: న్యాయం పేరుతో నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదని పేర్కొంది. నిష్పాక్షిక విచారణ పూర్తికాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని, అలాంటి వ్యక్తుల నివాసాలను కూల్చడం అధికార దుర్వినియోగం, చట్ట విరుద్ధం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇళ్లను కూల్చడం నివసించే ప్రాథమిక హక్కును కాలరాయడమేనని, దోషిగా నిర్దారించినా సరే చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది తప్ప బుల్డోజర్లతో న్యాయం చేయలేమని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. రాష్ట్రాలు, ఆయా ప్రభుత్వాల అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read : Gold : రానున్న రోజుల్లో మరింతగా తగ్గునున్న బంగారం ధర..! ట్రంప్ విక్టరీ పుణ్యమేనా..?
న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పును వెల్లడించింది. బోల్డోజర్ చర్యపై మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ.. ఆస్తి యాజమానికి 15రోజుల ముందస్తు నోటీసులు లేకుండా, చట్టబద్దమైన మార్గదర్శకాలు అనుసరించకుండా కూల్చివేతలను నిర్వహించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా యాజమానికి నోటీసు అందజేయాలని, నిర్మాణం బయటి భాగంలో నోటీసులు అంటించాలని పేర్కొంది. తీర్పు చదువుతున్న క్రమంలో జస్టిస్ గవాయ్.. కవి ప్రదీప్ రాసిన కవితను ఉటంకిస్తూ ఇల్లు ఒక కల అని, అది ఎప్పటికీ విఛ్చిన్నం కాదన్నారు. ఇంటిని కూల్చివేయడమే నేరానికి శిక్ష కాదని పేర్కొన్నారు.
ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయరాదు. మేము మార్గదర్శకాలను జారీ చేయాలా వద్దా అని ఆలోచించాము. విచారణ లేకుండా ఇంటిని కూల్చివేయడం ద్వారా ఎవరినీ శిక్షించలేరు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ధర్మాసనం హెచ్చరించింది. కూల్చివేత ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే.. సంబంధిత ఇంటి యాజమానికి పరిహారాన్ని అధికారుల జీతం నుంచి వసూలు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. అయితే, రహదారులు, ఫుట్ పాత్ ల మీద, రైలు మార్గాలు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించవంటూ సుప్రీంకోర్టు మినహాయింపునిచ్చింది.