Site icon 10TV Telugu

Tarun Tejpal : రేప్ కేసులో నిర్థోషిగా “తెహల్కా” మాజీ ఎడిటర్

Tarun Tejpal

Tarun Tejpal

Tarun Tejpal రేప్ కేసులో తెహల్కా మ్యాగజైన్ ఫౌండర్-ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఊరట లభించింది. 8 ఏళ్ల నాటి సహచర జర్నలిస్ట్ పై రేప్ కేసులో ఆయనను గోవా ట్రయల్ కోర్టు శుక్రవారం నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఈ తీర్పుని గోవా ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.

అసలేం జరిగింది
2013లో గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ లో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్‌కు హాజరైనప్పుడు హోటల్ లోని ఎలివేటర్ లో తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగికదాడికి పాల్పడినట్టు ఓ మహిళా జర్నలిస్ట్ ఆరోపించింది. తెహెల్కాలో తన సీనియర్లకు సదరు మహిళా ఉద్యోగి వరుస మెయిల్స్ పంపడంతో విషయం బయటకొచ్చింది. దీంతో తేజ్‌పాల్ ఎడిటర్ ఇన్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. దీనిపై బాధిత జర్నలిస్ట్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు..2013 నవంబర్ లో తరుణ్ తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. 2014లో ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేశారు. 2014 మేలో బెయిల్‌పై ఆయన బయటకు వచ్చారు.

2017 లో గోవా ట్రయల్ కోర్టు అతనిపై అత్యాచారం, లైంగిక వేధింపులు మరియు బలవంతంగా నిర్బంధం వంటి అభియోగాలు మోపింది. అయితే దీనిపై తరుణ్ తేజ్‌పాల్ మొదట బాంబే హైకోర్టులో, తరువాత సుప్రీంకోర్టులో ఆరోపణలను సవాలు చేశారు. అయితే గోవాలో విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా, తీర్పును వెలువరించిన గోవా కోర్టు.. తరుణ్ తేజ్‌పాల్‌ను నిర్దోషిగా పేర్కొంది. కోర్టు తీర్పు ప్రకటించినప్పుడు.. తరుణ్ తేజ్‌పాల్‌ తన కుటుంబంతో పాటు మాపుసాలోని కోర్టులో హాజరయ్యారు. వాస్తవానికి సెషన్స్ కోర్టు బుధవారమే తీర్పు వెలువరించాల్సి ఉండగా.. తౌక్టే తుఫాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో శుక్రవారం తీర్పును వెలువరించింది.

తరుణ్ తేజ్‌పాల్ కుమార్తె కారా తేజ్‌పాల్ తన తండ్రి తరపున ఒక ప్రకటన చదివి వినిపించారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ న్యాయస్థానం కఠినమైన, నిష్పాక్షిక, న్యాయమైన విచారణ, సీసీటీవీ ఫుటేజ్, ఇతర అంశాలను సమగ్రంగా పరిశీలించినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు వల్ల గత ఏడున్నరేళ్లుగా తమ కుటుంబం వేదన అనుభవించింది.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ప్రజా జీవితాన్ని ఇది ఎంతో ప్రభావితం చేసింది అని అన్నారు. అలాగే, కరోనాతో చనిపోయిన తన తరఫున న్యాయవాది రాజీవ్ గోమ్స్‌కు తేజ్‌పాల్ కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version