Site icon 10TV Telugu

Rain Alert: బీ అలర్ట్.. 13నుంచి దంచుడే దంచుడు.. ఆ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయ్.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

Heavy Rains

Heavy Rains

Hyderabad Rains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా తెలంగాణలో ఇవాళ 13 జిల్లాల్లో, రేపు 19 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.

ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 13 నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

బంగాళాఖాతంలో అతిత్వరలోనే ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా ఆంధ్రా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అల్పపీడనం ఏర్పడిన రోజు (ఈనెల 13) నుంచి మూడ్రోజులు పాటు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 13, 14, 15 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. హైదరాబాద్ లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా.. ఆరు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 422.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 399.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్ మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ లెక్కల ద్వారా తెలుస్తుంది.

మంచిర్యాల జిల్లాలో 37శాతంలోటు వర్షపాతం నమోదు కాగా.. ఆ తరువాత పెద్దపల్లిలో 33శాతం, జగిత్యాలలో 28శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 25శాతం, నిర్మల్ జిల్లాలో 24శాతం, నిజామాబాద్ జిల్లాలో 22శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో 39శాతం, రంగారెడ్డి 34శాతం, యాదాద్రిలో 30శాతం, వనపర్తిలో 24శాతం, నారాయణపేటలో 24శాతం, సిద్దిపేటలో 21శాతం చొప్పున అధిక వర్షాలు కురిశాయి. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదైంది.

Exit mobile version