Ram Navami 2022 : శ్రీరామ నవమి విశిష్టత

ధర్మ సంస్ధాపన కోసం శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించిన రోజే చైత్రశుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని కీర్తిస్తూ భక్త జనం పండుగ జరుపు

Ram Navami 2022 : ధర్మ సంస్ధాపన కోసం శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించిన రోజే చైత్రశుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని కీర్తిస్తూ భక్త జనం పండుగ జరుపుకుంటున్న శుభ తరుణమిది. 10-04-2022 చైత్ర శుక్ల పక్ష నవమి శ్రీరామనవమిగా హిందూ భక్తులు జరుపుకుంటున్నారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.

పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు.

ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు.

చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

శ్రీ రామనామ ప్రాశస్త్యం
ఒకసారి పార్వతీదేవి పరమశివుని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
        సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఇక భక్త రామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది. కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట! శ్రీరామనవమి రోజున ఊరు,వాడ వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు

భద్రాచలంలో శ్రీసీతారామ కళ్యాణం
శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ సమయం ఆసన్నమవడంతో భద్రాచలం పుణ్యక్షేత్రం పూర్తి ఆధ్యాత్మిక సందడిని సంతరించుకుంది. ఇప్పటికే నవమి పనులు తుది దశకు చేరుకోగా విద్యుత్ దీపాల వెలుగులు, వెదురు పందిళ్లు, చాందినీ వస్త్రాలంకరణలతో దేవస్థాన ప్రాంగణం మెరిసిపోతోంది. వేడుకకు తరలివచ్చే భక్తుల కోసం లడ్డూలు, ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేశారు. కల్యాణం అనంతరం తలంబ్రాలను పంపిణీ చేసేందుకు 60 ప్రత్యేక కౌంటర్లు, లడ్డూ ప్రసాదాల విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ఆదివారం మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణం జరగనుండగా.. శనివారం రాత్రి వైకుంఠ ద్వారం వద్ద శ్రీ సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కమిషనర్ అనిల్ కుమార్.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే సోమవారం జరిగే మహాపట్టాభిషేకానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తుల రాక ఆరంభం
సీతారామచంద్రుల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వందలాది మంది భక్తులు పాదయాత్రగా భద్రాద్రికి వస్తుండటం విశేషం. సాధారణ భక్తుల కోసం 3.50లక్షల చదరపు అడుగుల్లో చలువ పందిళ్లు, షామియానాలను ఏర్పాటు చేయగా.. ఆన్లైన్లో లాడ్డీ గదుల బుకింగ్ కు అవకాశ మిచ్చారు. అలాగే తాగునీటి సౌకర్యం, ప్రత్యేక మరుగుదొడ్లను సిద్ధం చేశారు.

తెలుగు రాష్ట్రాల నుంచి మూడు రోజుల్లో 850 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 10న శ్రీరామనవమి రోజున సీఎం కేసీఆర్, మహాపట్టాభిషేకానికి 11న గవర్నర్ తమిళిసై దంపతులు రానుండటంతో భద్రగిరి మొత్తం పోలీసు నిఘా నేత్రంలోకి వెళ్లింది. అన్ని ప్రధాన కూడళ్లలో శాశ్వత సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా.. రామాలయ పరిసరాలు, గోదావరి నదీ తీరంలో నిఘా పెంచారు. ఎస్పీ సునీల్ దత్ పర్యవేక్షణలో భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ తో పాటు పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. ఇప్పటికే గవర్నర్, సీఎంల రాక సందర్భంగా పోలీసులు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. బాంబు, డాగ్ స్క్యాడ్ తనిఖీలు చేపట్టారు.

Lighting Arrangement At Bhadrachalam Temple

ట్రెండింగ్ వార్తలు