Banswada Constituency: బాన్సువాడలో ప్రచారంలోకి దిగిపోయిన పోచారం.. ఆ సెంటిమెంట్ నుంచి గట్టెక్కుతారా?

బాన్సువాడపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు రెడీ అయిపోతున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, రానున్న ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనంటూ ప్రచారంలోకి దిగిపోయారు.

Banswada Assembly Constituency: తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం బాన్సువాడ. వరుసగా ఆరు సార్లు విజయం సాధించిన పోచారం.. అప్పుడు.. ఇప్పుడు ఎప్పుడూ ఒకే దూకుడు చూపిస్తున్నారు. కానీ, వచ్చే ఎన్నికల్లో తన వారసుడిని రంగంలోకి దించాలని కోరుకున్నారు. అయితే పోచారం ఆశలపై సీఎం కేసీఆర్ నీళ్లు చల్లారు. తనకు ఎంతో సన్నిహితుడైన పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy)నే మరోసారి బరిలో దింపాలని డిసైడ్ అయ్యారు గులాబీబాస్. వయోభారం ఉన్నా… క్లీన్ ఇమేజీతో పోచారం బరిలో దిగితేనే గెలుపు ఖాయమని భావిస్తున్నారు సీఎం. కేసీఆర్‌ (KCR) ఆదేశాలతో మరోసారి బాన్సువాడ బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు పోచారం. దీంతో విపక్షాలు కూడా పోచారంపై దీటైన అభ్యర్థిని రేసులో దింపేందుకు రెడీ అవుతున్నాయి.

బాన్సువాడ నియోజకవర్గం 1952లో ఏర్పాటు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ, బీర్కూరు, నసురుల్లాబాద్, వర్ని, కోటగిరి, రూద్రూరు. చందూరు మోస్రా మండలాలున్నాయి. 87 వేల 541 మంది పురుషులు 94 వేల 941 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తంగా లక్ష 82 వేల 489 మంది ఓటర్లు బాన్సువాడలో ఉన్నారు. ఒకపుడు బాన్సువాడ అంటే టిడిపికి కంచుకోట. తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా 2012లో అప్పటి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కారెక్కేశారు. అప్పటినుండి ఇక బాన్సువాడలో కారుజోరుకు తిరుగులేకుండా పోయింది.

పోచారం శ్రీనివాసరెడ్డి (photo: facebook)

ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల హయాంలో మంత్రిగా పనిచేసిన పోచారం. తెలంగాణా ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ తొలి కేబినెట్‌లో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2018లో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ పాత్రలోనూ పోచారం తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. జిల్లాలో విలక్షణ నేతగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 53 శాతం ఓట్లు సాధించి.. 18 వేల 845 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. స్పీకర్ గా ఉన్నా…అవకాశం దొరికితే నియోజకవర్గంలో ఉంటారనే పేరుంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారనే టాక్ ఉంది. రాష్ట్రంలో అత్యధిక డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి పంపిణీ చేసిన ఘనత పోచారానికే దక్కుతుంది.

పోచారం భాస్కర్ రెడ్డి (photo: facebook)

నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగిన పోచారం.. వయోభారంతో వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని భావించారు. తనకు బదులుగా వచ్చే ఎన్నికల్లో తన వారుసుల్లో ఎవరో ఒకరిని పోటీకి దింపాలని అనుకున్నారు. శ్రీనివాసరెడ్డి ఇద్దరు కుమారుల్లో ఒకరైన డిసిసిబి ఛైర్మన్‌ పోచారం భాస్కర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని స్థానిక నాయకులు, కార్యకర్తలు సైతం కోరారు. కానీ, సీఎం కేసీఆర్‌ ఆలోచన మరోలా ఉందని చెబుతున్నారు. పోచారం కుమారులపై వ్యతిరేకత లేకపోయినా.. వచ్చే ఎన్నికల్లో రికార్డు విజయం కోసం ఎదురుచూస్తున్న సీఎం.. గెలిచే అవకాశం ఉన్న స్పీకర్‌కు విశ్రాంతి ఇవ్వడానికి ఇష్టపడటం లేదని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డే మళ్లీ పోటీ చేస్తే గెలవడం ఈజీగా భావిస్తున్నారు సీఎం. దీంతో శ్రీనివాసరెడ్డి మళ్లీ పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది.

కాసుల బాలరాజు (photo: twitter)

కాంగ్రెస్ నుంచి కాసుల బాలరాజు (Balraju Kasula) గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. పీఆర్పీ నుంచి కూడా బరిలోకి దిగాడు. అయితే బాన్సువాడలో గెలుపు సాధ్యం కాలేదు. రానున్న ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు కాసుల బాలరాజు రెడీ అవుతున్నారు. బాలరాజుకు చందూరు జడ్పీటీసీ అంబర్ సింగ్ నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర నేత ఎల్లారెడ్డి(Yellareddy) నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మదన్ మోహన్ రావు (Madan Mohan Rao) సైతం సమీకరణాలు కుదరకపోతే బాన్సువాడ బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మదన్ మోహన్ బరిలో దిగితే ఈ సారి గట్టి పోటీ తప్పకపోవచ్చునని అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ హయంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని… తెలంగాణాలో కాంగ్రెస్ గాలి వీస్తుందని ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు.

Also Read: బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఢీకొట్టేదెవరు.. ఈసారి హ్యాట్రిక్ కొడతారా?

మల్యాద్రిరెడ్డి (photo: facebook)

బీజేపి నుంచి మల్యాద్రిరెడ్డి (Malyadri Reddy) పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. బీజేపి నుంచి పోటీ చేసేందుకు ఓ ఎన్ఆర్ఐ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అజ్ఞాత ఎన్ఆర్ఐ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. బీజేపీలో రెండు వర్గాలు ఉండటం… ఆ రెండువర్గాల మధ్య తారాస్థాయిలో విభేదాలు నెలకొనడంతో కమలదళానికి ఇబ్బందిగా మారుతోంది. తాను గెలిచిన మూడు నెలల్లో పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానంటూ ప్రచారంలోకి దిగిపోయారు బిజేపీ నేత మాల్యాద్రిరెడ్డి.

Also Read: కామారెడ్డిలో గంప గోవర్దన్‌కు టికెట్ దక్కుతుందా.. బీఆర్ఎస్ టిక్కెట్ పైనే గెలుపోటములు!

ఏదేమైనా తన కంచుకోట బాన్సువాడపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు రెడీ అయిపోతున్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, రానున్న ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనంటూ ప్రచారంలోకి దిగిపోయారు పోచారం. అయితే స్పీకర్ గా ఉన్నవాళ్లు మళ్లీ గెలిచే అవకాశం లేదనే సెంటిమెంట్ నుంచి పోచారం గట్టెక్కుతారో లేదో వేచిచూడాలి.

ట్రెండింగ్ వార్తలు