రానున్న 24 గంటల్లో ఏపీకి మరో ముప్పు..! ఆ 3 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

7 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Ap Rain Alert : ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తోంది. రాష్ట్రంలో మరోసారి వర్షం బీభత్సం సృష్టించనుందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు(సెప్టెంబర్ 5) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో నాలుగు రోజుల పాటు భారీ వానలు పడతాయంది. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ముఖ్యంగా పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 7 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

”పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం, అలాగే రుతుపవనాల ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్రలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చు. ముఖ్యంగా 3 జిల్లాలు.. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు రాగలవు.

అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశాం. ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షం అంటే మినిమం 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అవుతుంది. భారీ వర్షం రేంజ్ 7-12 సెంటీమీటర్లు. 12 సెంటీమీటర్లకన్నా ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని అతి భారీ వర్షం అంటాం. ఈ రేంజ్ లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

కచ్చితంగా అంత వర్షం వస్తుందని చెప్పలేము. కానీ అవకాశం ఉంది. రానున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే.. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు, దక్షిణ కోస్తా వరకు చూస్తే ఇవాళ్టి నుంచి 6వ తేదీ వరకు మోస్తరు వానలే పడే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చు. ఏపీకి సమీపంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ కారణంగా రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాలపై ప్రభావం ఉంటుంది” అని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు.

Also Read : మరో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణకు మరోసారి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన..!

ఇప్పటికే కురిసిన కుండపోత వానలతో, వరదలతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన రోడ్డున పడ్డారు. ఈ పరిస్థితుల్లో మరోసారి వాన గండం పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు