Gold Prices: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకి రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. భారత్ లో 10 గ్రాముల పసిడి ధర ఏకంగా లక్ష మార్క్ ని కూడా తాకి సంచలనం రేపింది. త్వరలో 10 గ్రాముల పుత్తడి ధర లక్షన్నర కావొచ్చనే అంచనాలూ లేకపోలేదు. దీంతో పుత్తడిని చూస్తే చాలు జనాలు భయపడిపోతున్నారు.
ధరలు ఇలా పెరుగుతూ పోతే కనీసం రవ్వంత అయినా బంగారం కొనగలమా అని బెంబేలెత్తిపోతున్నారు. ముందు ముందు పసిడి ధరలు ఇంకా ఏ రేంజ్ లో పెరుగుతాయోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ బంగారు గని సంస్థ సీఈవో చెప్పిన వార్త భారీ ఊరటనిచ్చింది. ఆయన ఏం చెప్పారంటే.. పసిడి పరుగులకు బ్రేక్ పడుతుందట, గోల్డ్ ధరలు భారీగా తగ్గుతాయట.
రాబోయే 12 నెలల్లో బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని కజకిస్తాన్ బంగారు గని సంస్థ సాలిడ్‌కోర్ రిసోర్సెస్ పీఎల్‌సీ సీఈవో విటాలీ నెసిస్ తెలిపారు. శుక్రవారం బంగారం ధర తగ్గింది. డాలర్ పెరగడం, దానికితోడు అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే సంకేతాలు కనిపించడంతో తగ్గుదల కనిపించింది.
”12 నెలల్లో గోల్డ్ ధరలు (ఒక ఔన్స్) 2,500 డాలర్లకి తగ్గుతాయని నేను భావిస్తున్నాను. అయితే, 1,800-1,900 డాలర్ల స్థాయికి తిరిగి రావడం సాధ్యం కాదు. బేస్ లెవల్‌కు ప్రీమియం అలాగే ఉంటుంది. సాధారణంగా బంగారంపై ఓ స్థాయి వరకు ప్రతిస్పందన ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది (ధరలు పెరగడం) ఓవర్ రియాక్షన్” అని కజకిస్తాన్‌లోని రెండవ అతిపెద్ద గోల్డ్ మైనర్ సాలిడ్‌కోర్‌కు చెందిన CEO విటాలీ నెసిస్ అన్నారు.
విటాలీ నెసిస్ చెప్పిన ప్రకారం చూస్తే.. ఒక ఔన్స్ అంటే 28.3495 గ్రాముల బంగారం ధర 2,500 డాలర్లకు తగ్గుతుంది. అంటే 10 గ్రాముల ధర దాదాపు 75వేలకు దిగొస్తుంది. సాంప్రదాయకంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకు వ్యతిరేకంగా రక్షణ కవచంగా భావించే బంగారం ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 26 శాతం పెరిగింది. అమెరికా సుంకాలు మాంద్యం భయాలను రేకెత్తించాయి. ఈ క్రమంలో గత మంగళవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం రికార్డు స్థాయిలో 3,500.05 డాలర్లను తాకింది.
మరోవైపు ఈ వారం ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ప్రత్యక్ష చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పారు. అదే సమయంలో అమెరికా డాలర్ పెరిగింది. అటు చైనా తన 125 శాతం సుంకాల నుండి కొన్ని అమెరికా దిగుమతులను మినహాయించాలని పరిశీలిస్తోంది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here