Heavy Rian in Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇవాళ (బుధవారం) అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరికొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాత్రి రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జనగాం జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో అత్యధికంగా 11.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా త్రిపురాం మండలం కామారెడ్డిగూడెంలో 10.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.
గురువారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 27 వరకు అదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది.