Telangana Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం పడుతుంది. అయితే, పలుచోట్ల పిడుగులతో కూడిన వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే ఐదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. 13వ తేదీన మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉండటంతో 13, 14 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతుంది. ఇవాళ (మంగళవారం) కూడా నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం.. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, డీఆర్డీఎఫ్, పోలీస్ సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ (మంగళవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
గురువారం భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అదేవిధంగా అదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.