CMR College Girls Hostel : మేడ్చల్ ప్రాంతంలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ నంద కిశోర్, గోవింద్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు.
Read Also : జగన్ విధ్వంసంతో గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు: మంత్రి నిమ్మల
ఈ కేసులో సీఎంఆర్ కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డితో సహా ఏడుగురిని నిందితులుగా చేర్చారు. సెక్షన్ 11, 12 సహా పలు సెక్షన్లతో పాటు పోక్సో కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గర్ల్స్ హాస్టల్లోని బాత్రూమ్‌ల్లోకి నిందితులు తొంగిచూసినట్లుగా విచారణలో గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే గర్ల్స్ బాత్రూమ్‌ల్లోకి గోవింద్, కిశోర్ తొంగిచూసినట్టు దర్యాప్తులో తేలింది.
ఎ1, ఎ2గా కిశోర్, గోవింద్.. రిమాండ్‌కు తరలింపు
నిందితులు కిశోర్, గోవింద్ సహా ఐదుగురిపై కేసు నమోదైంది. ఎ1 నిందితుడిగా నంద కిషోర్ కుమార్, ఎ2గా గోవింద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డిని ఎ7గా చేర్చారు. ఎ5గా ప్రిన్సిపాల్ అనిత నారాయణ, ఎ6గా కాలేజ్ డైరెక్టర్ మద్దిరెడ్డి జగన్ రెడ్డి, ఎ4, ఎ3గా హాస్టల్ వార్డెన్స్ అల్లం ప్రీతీ రెడ్డి, ధనలక్ష్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హాస్టల్ విద్యార్థినుల గురించి గోవింద్, కిశోర్ అసభ్యకరంగా మాట్లాడారని, విద్యార్థినులు నిందితులపై ఫిర్యాదు చేసినప్పటికీ కాలేజీ యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టకుండా వదిలేసింది. దాంతో కాలేజీ యాజమాన్యంపై కూడా కేసులు నమోదు అయ్యాయి. విద్యార్థినుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ కాలేజీ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు.
గర్ల్స్ హాస్టల్ బాత్ రూంలో వీడియో రికార్డు చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కాలేజీ ఘటనపై విద్యార్థినిలు సహా ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. కాలేజీ ప్రాంగణమంతా అందోళన వాతావరణం నెలకొంది. దీనిపై స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్ వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు సూచించింది. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.