బతుకు అమ్మా : తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుక

  • Publish Date - September 28, 2019 / 03:12 AM IST

బతుకు అమ్మా…అంటూ ఆడబిడ్డల్ని దీవించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగకు తెలంగాణ శోభాయమానంగా సిద్ధమైంది. బతుకమ్మలను పేర్చేందుకు ఆడబిడ్డలు రంగు రంగుల పూలను సిద్ధంచేసుకున్నారు. ఆటపాటలతో బతుకమ్మను కొలుచుకుంటూ తమ కుటుంబాలను చల్లగా చూడమ్మా అని దీవించమని వేడుకునే ఈ బతుకమమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్దలతో అత్యంత శోభాయమానంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రానికే ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేక ఆకర్షణగా అలరిస్తోంది. మొత్తం తొమ్మిది రోజుల పాటు..తెలంగాణ ఆడబిడ్డలు  తొమ్మిది పేర్లతో బతుకమ్మ పూజించుకుంటారు. మరి ఆ తొమ్మిది రోజులు బతుకమ్మను ఏఏ పేర్లతో పిలుచుకుంటారో..వాటి విశిష్టత ఏంటో తెలుసుకుందాం..
మొదటి రోజు  ఎంగిలిపూల బతుకమ్మ
నవరాత్రుల బతుకమ్మ మొదటిరోజును ఎంగిలిపువ్వు బతుకమ్మ అంటారు. ఆ పేరు ఎందుకొచ్చిదంటే..బతుకమ్మను పేర్చడానికి కావాల్సిన పువ్వులను ఒకరోజు ముందుగానే చెట్ల నుంచి తెంపుకుని తెచ్చుకుంటారు. వాటిని వాడిపోకుండా..నీటిలో వేసి లేదా ఆకులలో చుట్టి..తాజాగా ఉండేలా చూసుకుంటారు. ఆ పువ్వులను మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు అమ్మవారుగా పిలుస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. మొదటి రోజున తెలాంగాణ ఆడపడుచులంతా తమలపాకులు, తులసి ఆకులు వాయనంగా ఇచ్చుకోవటం ఆనవాయితీగా జరుపుకుంటారు. 
రెండవ రోజు అటుకుల బతుకమ్మ
రెండవ రోజునాడు బతుకమ్మ పండుగలో పూలదే ప్రత్యేకత. రంగుల రంగుల పూలను సేకరించిన ఆడబడ్డలు ఉదయాన్నే ప్రకృతి ప్రసాదించిన  తంగేడు, గునుగు, బంతి, చామంతి తెచ్చుకుంటారు. అంతేకాదు ఈ బతుకమ్మ పండుగలో మరో విశిష్టత గడ్డి పూలు. గడ్డిపూలు ఏ పూజకు పనికిరావంటారు. కానీ  ఈబతుకమ్మ పండుగలో గడ్డిపూలను కూడా వినియోగించటం ప్రత్యేకత. అలా తెచ్చుకున్న పూలను గౌరమ్మను పేర్చి, గౌరమ్మను ఇంటి ముందు పెట్టి  పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ..ఆడబిడ్డలంతా కలిసి..మెలసి సంబరాలు చేసుకుంటారు. సాయంత్రం వేళలో ఆ పూల గొబ్బెమ్మలను చెరువులలో నిమజ్జనం చేస్తారు. రెండవ రోజు ప్రసాదంగా అటుకులు వాయనంగా పెడతారు. అందుకే అటుకుల బతుకమ్మ అంటారు. 
మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ
మూడవ రోజు ముఖ్యంగా సీతమ్మజడ, చామంతి, మందార, రామబాణం పూలతో అలంకరించి తామర ఆకులతో  బతుకమ్మను చాలా అందంగా అలంకరిస్తారు. సీతమ్మ జడ పూలు బతుకమ్మకు మరింత అందాన్ని తెస్తాయి.  ఆ బతుకమ్మ శిఖరంపై అంటే పై భాగాన గౌరమ్మ తల్లిని పెడతారు. గ్రామాల్లో అయితే నడివీధిలో అంటే నాలుగు రోడ్ల కూడలిలో బతుకమ్మ ఆటలు ఆడతారు. తరువాత ఆ బతుకమ్మను చెరువులో నిమజ్జన్నం చేస్తారు. మూడవ రోజు ప్రసాదంగా  బెల్లం,సత్తుపిండి, చక్కెర, పేసర్లు కలిపి వాయనంగా పెడుతారు.
నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మ
నాలుగవరోజు రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు అంటే నాలుగు అంతస్థులుగా  బతుకమ్మను పేర్చి పూల పైన గౌరమ్మను ఆట పాటలతో ఆడబిడ్డలంతా కొలుచుకుంటారు. నానబెట్టిన బియ్యం బెల్లంతో కలిపి ముద్దలు చేసి..ప్రసాదంగా పెట్టి వాయనాలుగా పంచుకుంటారు.  
ఐదవ రోజు అట్ల బతుకమ్మ
ఐదవ రోజు ఐదు రకాల పూలు అంటే  తంగేడు, గునుగు, చామంతి, మందార, గుమ్మడి పూలతో ఐదంతరాలుగా అంటే ఐదు అంతస్థులుగా అంత్యంత రమణీయంగా పేరుస్తారు. సాయంత్రం ఆడబిడ్డలంతా బతుకమ్మలా అందంగా ముస్తాబై బతుకమ్మను ఆడుతారు. ఐదవ రోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడుతారు.
ఆరవ రోజు అలిగిన బతుకమ్మ
ఆరవరోజు బతుకమ్మను పేర్చరు. పూర్వకాలంలో ఆరవరోజు బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్దా తగిలిందని అది అపచారమని భావించిన బతుకమ్మలు బతుకమ్మను పేర్చరు.అందుకే బతుకమ్మా అపచారం జరిగిపోయింది..కాబట్టి మా మీద అలగవద్దు బతుకమ్మా..మాపై ఆగ్రహించవద్దు..నీ బిడ్డలం మమ్మల్ని కరుణించు..అని వేడుకుంటారు ఆడబిడ్డలు.అందుకే ఆరవ రోజు బతుకమ్మను తయారు చేయరు. 
ఏడవరోజు వేపకాయల బతుకమ్మ
ఏడవరోజున బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతారాలుగా అంటే ఏడు వరుసలుగా ఎత్తుగా  పేరుస్తారు.  ఆటపాటలతో పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఏడవరోజు  వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు. అందుకే ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అంటారు. 

ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ
ఎనిమిదవ రోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు పూలతో మరింత ఎత్తుగా అంటే ఎనిమిది అంతరాలుగా  బతుకమ్మగా పేర్చి..ఇంటి దగ్గర కాకుండా దేవాలయం దగ్గర ఆడబిడ్డలంతా చేరి ఆట,పాటల బతుకమ్మను కొలుచుకుని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఎనిమిదవ రోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు.
తొమ్మిదమ రోజు సద్దుల బతుకమ్మ
తొమ్మిదో రోజు చివిర రోజు ఎంతో కన్నుల పండువగా ఉంటుంది. సందడి..సందడి ఉంటుంది. ఆనందమంతా అక్కడే ఉందా అన్నట్లుగా ఉంటుంది. బతుకమ్మ పూలతో పాటు ఎన్ని రకాల పూలు దొరికితే అన్నిరకాల పూలతో బతుకమ్మను చాలా పెద్దగా పేరుస్తారు. అన్ని రంగులతో బతుకమ్మ చూడటానికి రెండు కళ్లూ చాలనంత అందంగా  ఉంటుంది. ఒకరి మించి మరొకరు బతుకమ్మను పేరుస్తారు.  ఆడబిడ్డలంతా చాలా ఉత్సాహంగా ఆటపాటలతో..సంబరాలు చేస్తారు. పెద్ద బతుకమ్మ పక్కన మరో చిన్న గౌరమ్మను కూడా తయారు చేసి పూజిస్తారు. చివరి రోజు కాబట్టి  చీకటి పడే వరకు అలసిపోకుండా..ఆనందగా పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆటలు ఆడుకుంటారు ఆడబిడ్డలు. పెద్ద బతుకమ్మ రోజు..చివరి రోజు కాబట్టి అందరూ కలసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో నిమజ్జనంతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. 

బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ. ఆడబిడ్డల పండుగ. బతుకు అమ్మా అని అన్నదమ్ములు..తల్లి దండ్రులు ఆడబిడ్డల్ని దీవించే పండుగ. ప్రకృతితో మమేకమయ్యే ఆనందాల వేడుక..పండుగ బతుకమ్మ పండుగ. 

ట్రెండింగ్ వార్తలు