Power Cut: కోత మొదలైంది.. కొందామన్నా కరెంట్ దొరకట్లే!

ఏపీలో మళ్ళీ విద్యుత్ కోత మొదలైంది. ఇటు అనుకున్న స్థాయిలో ఉత్పత్తి లేకపోగా.. బహిరంగ మార్కెట్ లో కొందామన్నా విద్యుత్ దొరకకపోవడంతో కోతలు విధిస్తున్నారు. నిజానికి వాతావరణం వేడిగా..

Power Cut: ఏపీలో మళ్ళీ విద్యుత్ కోత మొదలైంది. ఇటు అనుకున్న స్థాయిలో ఉత్పత్తి లేకపోగా.. బహిరంగ మార్కెట్ లో కొందామన్నా విద్యుత్ దొరకకపోవడంతో కోతలు విధిస్తున్నారు. నిజానికి వాతావరణం వేడిగా ఉంటేనే విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండాలి. కానీ.. ఇప్పుడు వాతావరణ కాస్త చల్లబడినా.. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం మాత్రం గత ఏడాది కంటే ఇరవై శాతం అధికంగా ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో బొగ్గు కొరతతో ధర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తిని నిలిపేయడంతో విద్యుత్ కు డిమాండ్ పెరిగింది.

మరోవైపు దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్‌ పెరగటంతో ఏపీకి కొందామన్నా దొరకట్లేదు. యూనిట్‌ రూ.20 వెచ్చించి బహిరంగ మార్కెట్‌లో కొందామన్నా విద్యుత్ దొరకకపోవడంతో కోతలు తప్పడం లేదు. ముఖ్యంగా వినియోగం ఎక్కువగా ఉండే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల సమయంలోనే విద్యుత్‌ దొరకకపోవడంతో అదే సమయంలో కోతలు విధిస్తున్నారు. ముందుగా లోడ్ ఫీడర్లను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో 2-3 గంటలు విద్యుత్‌ కోతలు విధిస్తుండగా అప్పటికీ సర్దుబాటు కాకుంటే చిన్న పట్టణాలకు సరఫరా నిలిపేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం వరితో పాటు మెట్ట పంటల సాగుకు రోజుకు కనీసం 20 ఎంయూల విద్యుత్‌ అవసరం కాగా వేసవిలో మరింతగా పెరుగుతుంది. రానున్న వేసవిలో రోజువారీ డిమాండ్‌ సుమారు 230 ఎంయూలకు చేరుతుందని అంచనా. అయితే రాష్ట్రంలోని జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లకు రోజుకు సుమారు 70 వేల టన్నుల బొగ్గు అవసరం కాగా గత నెలాఖరు వరకు రోజుకు 24 వేల టన్నులే అందుబాటులో ఉంది. ప్రస్తుతం సింగరేణి, మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి రోజుకు 40 వేల టన్నుల వరకు అందుతోంది. దీంతో అనుకున్న స్థాయిలో ఇక్కడా ఉత్పత్తి జరగడం లేదు.

వీటీపీఎస్‌లో ఒకరోజుకు విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు మాత్రమే ఉండగా ఆర్టీపీపీలో 3 రోజులకు నిల్వలు.. కృష్ణపట్నంలో 5 రోజులకు మాత్రమే ఉన్నాయి. మరోవైపు డిమాండ్‌ సర్దుబాటు కోసం విద్యుత్‌ సంస్థలు 40 ఎంయూలను బహిరంగ మార్కెట్‌ నుంచి కొంటుండగా గత నెల 15 వరకు యూనిట్‌ విద్యుత్‌ ధర సగటున రూ.4-5 మధ్య ఉండగా అది గత మూడు రోజులుగా బహిరంగ మార్కెట్‌లో రూ.15కు చేరింది. ఒక్కోసారి అసలు కొందామన్నా అందుబాటులో ఉండడంలేకపోగా రానున్న రోజులలో ఈ కరెంట్ కష్టాలు ఎలా ఉంటాయోనని ఆందోళన నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు