Earthquake In Turkey: టర్కీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు.. కూలిన భవనాలు..

టర్కీలో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ టర్కీలోని నుర్దగీకి 23కిలో మీటర్ల దూరంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. సోమవారం తెల్లవారు జామున 4.17గంటల సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించాయి.

Earthquake In Turkey: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ టర్కీలోని నుర్దగీకి 23కిలో మీటర్ల దూరంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. సోమవారం తెల్లవారు జామున 4.17గంటల సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించాయి. భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. స్థానిక మీడియా వివరాల ప్రకారం.. భూకంపం తీవ్రతకు పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు, భవనాలు కూలిపోయాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించి అధికారికంగా ధృవీకరించలేదు.

 

భూకంపం తీవ్రతకు టర్కీ, సిరియాలో పెనునష్టం వాటిల్లినట్లు వార్తలు వచ్చాయి. భారీ భూకంపం తర్వాత ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. లెబనాన్, సిరియాలో కూడా భూకంపం సంభవించింది. ఉత్తర నగరం అలెప్పో, సెంట్రల్ సిటీ హమాలో కొన్ని భవనాలు కుప్పకూలినట్లు సిరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది. ప్రాణనష్టం‌పై ఎలాంటి సమాచారం లేదు. బీరూట్, డమాస్కస్‌లలో అపార్ట్‌మెంట్లు, భవనాలు కంపించడంతో స్థానిక ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.

 

టర్కీ భౌగోళిక స్థానం కారణంగా అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గత పదమూడేళ్లుగా టర్కీలో సంభవించిన భూకంపాల కారణంగా వందలాది మంది మరణించినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు