90 లక్షల ఇళ్లు ఖాళీ.. జపాన్‌లో కొత్త సమస్య.. ఎందుకిలా?

ఆ దేశంలో వెకెంట్ హోమ్స్ పెరుగుతున్నాయి. పల్లెల్లోనే కాదు పెద్ద నగరాల్లోనూ ఖాళీ ఇళ్లు ఎక్కువగా కనబడుతున్నాయి.

Japan Akiya Homes: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న జపాన్‌లో కొత్త సమస్య వచ్చిపడింది. దేశంలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య మరింత పెరిగింది. ఇది సమస్య ఎలా అవుతుందని ఆలోచిస్తున్నారా? తక్కువ జనన రేటుతో ఇప్పటికే జపాన్‌లో జనాభా తగ్గిపోతోంది. దేశంలో ఉన్న జనాభా కూడా ఇతర దేశాలకు వలస వెళ్లిపోతుండడంతో అక్కడ ఇళ్లన్నీ ఖాళీ అవుతున్నాయి.

అధికారిక లెక్కల ప్రకారం జపాన్‌లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య 90 లక్షలకు చేరుకుందని, ఇది న్యూయార్క్ నగరంలో నివసిస్తున్న జనాభా కంటే ఎక్కువని సీఎన్ఎన్ వార్తా సంస్థ నివేదించింది. జపాన్‌ అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. అక్కడ నివాస ఆస్తులలో 14% ఖాళీగా ఉన్నాయని వెల్లడైంది. జనం లేని ఇళ్లు గణనీయంగా పెరగడానికి జపాన్ జనాభా తగ్గడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.

అకియా ఇళ్లు అంటే?
జనం లేకుండా చాలా రోజులుగా వదిలేసిన పాడుబడిన ఇళ్లను జపాన్‌లో “అకియా” అని పిలుస్తారు. ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఇళ్లు కనిపించేవి. కానీ ఇప్పుడు టోక్యో, క్యోటో వంటి పెద్ద జపనీస్ నగరాల్లో ఇటువంటి ఇళ్ళు కనిపిస్తున్నాయి. “ఇది జపాన్ జనాభా తగ్గుతోందని చెప్పడానికి ఇదే సంకేతం. అవసరానికి మించి ఎక్కువ ఇళ్లను నిర్మించడం వల్ల తలెత్తిన సమస్య కాదు. నివాస ప్రాంతాల్లో సరిపడా జనాభా లేకపోవడమే సమస్య” అని చిబాలోని కాండా యూనివర్సిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో లెక్చరర్ అయిన జెఫ్రీ హాల్ CNNతో అన్నారు.

Also Read: ప్రపంచంలోనే అత్యధిక సంపన్నులున్న నగరం ఏదో తెలుసా?

జపాన్‌లో “అకియా” ఇళ్లు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని జెఫ్రీ హాల్ వివరించారు. జపాన్ వాసులు ఉద్యోగాల కోసం విదేశాలకు వలస వెళ్లడం, ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉన్నవారు.. ఒకింట్లో నివసిస్తూ మిగతా వాటిని వదిలేయడం వంటి కారణాలతో అకియా” ఇళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడించారు. జపాన్‌లో తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా చాలా మందికి వారసులు లేకపోవడంతో ఆస్తుల బదిలీ జరగడం లేదు. వారసత్వంగా ఆస్తులు పొందిన గ్రామీణ యువతరంలో చాలా మంది నగరాలకు వలస వెళ్లి.. తిరిగి రావడానికి ఇష్టపడకపోవడం కూడా అకియా ఇళ్లు పెరగడానికి మరో కారణంగా కనబడుతోంది.

Also Read: భారత సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా జోక్యం? ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం చీప్ ట్రిక్స్‌!

కొనేవాళ్లే లేరు..
ఖాళీగా ఉన్న ఇళ్లను యజమానులు విక్రయించాలనుకున్నప్పటికీ కొనేవాళ్లు లేరని జెఫ్రీ హాల్ తెలిపారు. ఈ గృహాలలో చాలా వరకు ప్రజా రవాణా, ఆరోగ్య సంరక్షణ, సౌకర్యవంతమైన దుకాణాలకు దూరంగా ఉండడంతో.. వీటిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. కఠినమైన నిబంధనల కారణంగా విదేశీయులు ఇక్కడి ఇళ్లు కొనడానికి కష్టపడాల్సి వస్తోందని వివరించారు. జపనీస్ మాట్లాడడం, జపనీస్ చదవడం రానివారు ఇక్కడ ఆస్తులు కొనాలంటే మామూలు విషయం కాదన్నారు. “వారు చౌకగా ఈ గృహాలను పొందలేరు” అని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు