Thor Pedersen: విమానం ఎక్కకుండానే ప్రపంచం మొత్తాన్ని చుట్టేశాడు.. ఎలాగంటే? ఆఫీస్ జాబ్ వదిలేసి మరీ..

మనలో చాలామంది పక్క రాష్ట్రానికి వెళ్లాలన్నా, వేరే దేశానికి వెళ్లాలన్నా వెంటనే విమానం టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ ఈ ప్రపంచాన్ని ఇంకా పాత పద్ధతిలో, నెమ్మదిగా రోడ్డు, సముద్ర మార్గాల్లో కూడా అన్వేషించవచ్చని థోర్ నిరూపించాడు. అతని ప్రయాణంలో లగ్జరీ లేదు, బిజినెస్ క్లాస్ సౌకర్యాలు లేవు. కేవలం పట్టుదల, సహనం, మనిషిపై నమ్మకం మాత్రమే ఉన్నాయి.

Thor Pedersen: విమానం ఎక్కకుండానే ప్రపంచం మొత్తాన్ని చుట్టేశాడు.. ఎలాగంటే? ఆఫీస్ జాబ్ వదిలేసి మరీ..

Thor Pedersen (PC: adventure dot com)

Updated On : September 8, 2025 / 5:07 PM IST

Thor Pedersen: ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే మనకు వెంటనే గుర్తొచ్చేది విమానం. కానీ, ఓ వ్యక్తి మాత్రం ఫ్లైట్ అనే మాటే లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలనూ చుట్టి వచ్చాడు. ఇది సినిమా కథ కాదు, దాదాపు పదేళ్ల పాటు సాగిన ఓ వ్యక్తి సాహస యాత్ర.

ప్రతి దేశంలో కనీసం 24 గంటలు…

డెన్మార్క్‌కు చెందిన థోర్ పెడర్సెన్ (Thor Pedersen) 2013లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రపంచ యాత్ర మొదలుపెట్టాడు. అతని కల ఒక్కటే.. విమానం ఎక్కకుండా భూమి మీద ఉన్న ప్రతి దేశంలోనూ అడుగుపెట్టాలి. అంతేకాదు, మరిన్ని కఠినమైన నియమాలు పెట్టుకున్నాడు.

ప్రతి దేశంలో కనీసం 24 గంటలైనా గడపాలి. లక్ష్యం పూర్తయ్యే వరకు తిరిగి సొంత దేశానికి వెళ్లకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ విమాన ప్రయాణం చేయకూడదు.

నాలుగేళ్లలో ఈ యాత్రను పూర్తి చేయాలని అతను భావించాడు. కానీ, ఈ ప్రయాణం పూర్తి కావడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది.

బస్సులు, రైళ్లు, ఓడలే అతని విమానాలు 

మరి విమానం లేకుండా ఇన్ని దేశాలు ఎలా తిరిగాడు? అనే ప్రశ్న అందరికీ వస్తుంది. ఓర్పు, పట్టుదలతో పాటు అతను నమ్ముకున్నది భూమి, సముద్ర మార్గాలనే. తన ప్రయాణంలో అతను ఉపయోగించిన వాహనాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

అతను 351 బస్సులు, 158 రైళ్లు, 37 భారీ కంటైనర్ నౌకలు, 43 ఆటోల్లో ప్రయాణించాడు. ఇవే కాకుండా గుర్రపు బగ్గీలు, పోలీసు కార్లలో కూడా ప్రయాణించాడు.

బ్రెజిల్‌లో ఏకధాటిగా 54 గంటల బస్సు ప్రయాణం, రష్యాలో 5 రోజుల రైలు ప్రయాణం అతని సహనానికి పరీక్ష పెట్టాయి. రోజుకు కేవలం $20 (సుమారు రూ. 1600) బడ్జెట్‌తోనే తన ప్రయాణం, భోజనం, వసతి, వీసా ఖర్చులన్నింటినీ భరించాడు.

ప్రయాణం పూలపాన్పు కాదు… ఎన్నో సవాళ్లు

ఈ పదేళ్ల ప్రయాణంలో థోర్ ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కాదు. కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం, మరికొన్ని చోట్ల అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా మహమ్మారి వ్యాపించినప్పుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాడు.

అన్నింటికంటే పెద్ద సవాలు కరోనా మహమ్మారి రూపంలో ఎదురైంది. సరిహద్దులు మూసివేయడంతో, అతను దాదాపు రెండేళ్ల పాటు హాంకాంగ్‌లోనే చిక్కుకుపోయాడు. అయినా అతను నిరాశ చెందలేదు.

దేశాలు కాదు, మనుషులను గెలిచాడు

ఇన్ని కష్టాలు ఎదురైనా, తాను ఎక్కడికి వెళ్లినా మానవత్వమే కనిపించిందని థోర్ చెబుతాడు. ఆకలితో ఉన్నప్పుడు అపరిచితులు ఆహారం పెట్టారని, క్లిష్టమైన సరిహద్దులు దాటేందుకు స్థానికులు సహాయం చేశారని గుర్తు చేసుకున్నాడు. తన ప్రయాణంలో కేవలం ప్రదేశాలను చూడడమే కాదని, మనుషుల మంచితనాన్ని గురించి తెలుసుకున్నానని చెప్పాడు.

చరిత్ర సృష్టించిన ఆ చివరి ప్రయాణం

థోర్ ఒక కంటైనర్ నౌకలో తన చివరి గమ్యస్థానమైన మాల్దీవులకు 2023 మేలో చేరుకున్నాడు. ఆ క్షణంలో, విమానం ఎక్కకుండా ప్రపంచంలోని 203 దేశాలను సందర్శించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. పదేళ్ల తర్వాత తన సొంత దేశమైన డెన్మార్క్‌కు తిరిగి వెళ్లినప్పుడు, ప్రజలు అతనికి హీరోలా స్వాగతం పలికారు.

 

View this post on Instagram

 

A post shared by Travel by Travly ™ (@travel)