ట్రంప్ యూటర్న్.. దెబ్బకి దిగొస్తున్నాడా?.. టారిఫ్ లతో వసూలు చేసిన డబ్బుల్లో సగం వాపస్?
US Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల మోతపై ఆ దేశ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కీలక కామెంట్స్ చేశారు.

US Tariffs
US Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై టారిఫ్‌ల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న పలు ఉత్పత్తులపై ట్రంప్ ఇప్పటికే 50శాతం సుంకాలు విధించారు. త్వరలో మరింత సుంకాలు విధిస్తామని హెచ్చరికలు చేస్తున్నారు.
భారత దేశంపై ఎడాపెడా సుంకాలను విధించినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుపై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ సుంకాలను అమెరికన్ ప్రముఖులు, కొందరు ఆర్థికవేత్తలు తప్పుపడుతున్నారు. అయితే, ట్రంప్ ప్రత్యేక అధికారాలను వినియోగించి పలు దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించడంపై అమెరికాలోని ఫెడరల్ కోర్టు తప్పుబట్టింది. ట్రంప్ నిర్ణయాలు చట్ట విరుద్ధమని పేర్కొంటూ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అయితే, అక్కడ కూడా న్యాయమూర్తులు అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పును సమర్థిస్తే ట్రంప్ సర్కార్‌కు బిగ్‌షాక్ తగలనుంది. తాజాగా.. ఈ విషయంపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ ట్రంప్ టారిఫ్ విధానాలపై కీలక కామెంట్స్ చేశారు.
ట్రంప్ సుంకాలపై అమెరికా ఫెడరల్ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే.. టారిఫ్‌ల రూపంలో వసూలు చేసిన సొమ్ములు ఆయా దేశాలకు వెనక్కి ఇచ్చేస్తారా..? అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పందించారు.
తాము రష్యా నుంచి చమురు కొనుగోలుచేసే దేశాలపై రెండో విడత ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నామని, రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితేనే పుతిన్ చర్చల దారిలోకి వస్తారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. కోర్టు తీర్పు గురించి మాట్లాడారు.
ఫెడరల్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే మేము దాదాపు సగానికిపైగా టారిఫ్ సొమ్ములను తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. ఇది అమెరికా ఖజానాపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. న్యాయస్థానం చెబితే మేము చేసి తీరాల్సిందే. కాకపోతే సుప్రీంకోర్టులో మేము గెలుస్తాం అంటూ స్కాట్ చెప్పుకొచ్చారు.
అమెరికా ఫెడరల్ కోర్టు తన తీర్పులో.. 1977 అంతర్జాతీయ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ట్రంప్‌నకు టారిఫ్‌లు విధించే అధికారం లేదని స్పష్టం చేసింది. అయితే, ట్రంప్ కార్యవర్గానికి అప్పీల్ చేసుకునేందుకు అక్టోబర్ 14వ తేదీ వరకు సమయం ఇచ్చింది. అప్పటి వరకు కోర్టు ఆదేశాలు నిలిపివేసింది. దీంతో ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించి తమ వాదనలు వినాలని కోరింది.
అయితే, సుప్రీంకోర్టులో కేసు 2026 సంవత్సరం మధ్య వరకు కొనసాగి ప్రతికూల తీర్పు వస్తే.. అమెరికా ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం 750 బిలియన్ డాలర్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని స్కాట్ బెసెంట్ అంచనా వేశారు.