Vladimir Putin : అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి.. యుక్రెయిన్‌ ఆర్మీకి పుతిన్‌ పిలుపు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్ నాయకత్వాన్ని తొలగించి వెంటనే మీ చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవాలని యుక్రెయిన్ ఆర్మీకి సూచించారు.

Vladimir Putin :  యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్‌తో యుద్ధంలో రెండవ రోజు శుక్రవారం (ఫిబ్రవరి 25న) రాజధానిలో రష్యా దళాలు డజన్ల కొద్దీ ప్రాణాలను బలిగొన్నాయి. రష్యా దళాలతో పోరాడేందుకు యుక్రెయిన్ బలగాలు ప్రయత్నించినప్పటికీ.. కైవ్‌లో నాయకత్వాన్ని తొలగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రేనియన్ సైన్యానికి పిలుపునిచ్చారు. కీవ్ నాయకత్వాన్ని తొలగించి వెంటనే మీ చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు.

ఆ దేశ పాలకులను పుతిన్ ఉగ్రవాదులు, మాదకద్రవ్యాల బానిసలు నయా-నాజీల ముఠాగా అభివర్ణించారు. యుక్రేనియన్ సైన్యమే దేశాన్ని తమ అధీనంలోకి తీసుకుని దేశ నాయకత్వాన్ని తొలగించాలని పుతిన్ పిలుపునిచ్చారు. టెలివిజన్ ప్రసంగంలో యుక్రేనియన్ మిలిటరీని ఉద్దేశించి పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మీ సొంత చేతుల్లో అధికారాన్ని తీసుకోండి’ అని యుక్రెయిన్ ఆర్మీని కోరారు. మాదకద్రవ్యాల బానిసలు, నియో-నాజీల ముఠా కన్నా మేం మీతో ఏకీభవించడం చాలా సులభంగా ఉంటుందని అన్నారు. అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ నేతృత్వంలోని కైవ్‌లో నాయకత్వంపై పుతిన్ తప్పుబట్టారు. సొంత పౌరులపై దాడుల కోసమే కొందరికి తుపాకులు, ఆయుధాలను ఇచ్చారని విమర్శించారు.

ఆ నింద తమపై వేసేందుకు యుక్రెయిన్‌ పాలకులు కుట్రపన్నారని ఆరోపించారు. యుక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనని, ఇందుకోసం ప్రతినిధులను కూడా పంపుతామని పుతిన్‌ అన్నారు. ఇదిలా ఉండగా, యుక్రెయిన్ వివాదంలో ఇప్పటివరకు 1,000 మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారని యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా ప్రారంభం నుంచి తమ సాయుధ పోరాటాలలో ఎందులోనూ పోరాట సమయంలో ఇంత స్థాయిలో ప్రాణనష్టాన్ని చవిచూడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Vladimir Putin Putin Asks Ukraine Army To Remove Leadership In Kyiv

చర్చలకు జెలెన్‌స్కీ ప్రతిపాదన.. ప్రతినిధుల బృందాన్ని పంపేందుకు పుతిన్ రెడీ..! 

రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్‌ ఎదుర్కొనే పరిణామాలపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ చర్చల ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. రష్యా ఇచ్చిన ఆఫర్‌ను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి రష్యాకు విజ్ఞప్తి చేశారు. నేరుగా చర్చలు జరుపుదామంటూ పుతిన్‌ను కోరారు. ఈ క్రమంలోనే యుక్రెయిన్ ప్రతిపాదనకు సమ్మతించిన పుతిన్.. యుక్రెయిన్‌తో చర్చలకు తమ ప్రతినిధుల బృందాన్ని
పంపేందుకు సిద్ధమయినట్టు తెలుస్తోంది.

అంతకుముందు.. యక్రెయిన్‌పై రష్యా కీలక ప్రకటన చేసింది. యుద్ధం మొదలైన 40 గంటల తర్వాత యుక్రెయిన్‌కు రష్యా ఆఫర్ ఇచ్చింది. ఆయుధాలు వదిలితేనే యుక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని రష్యా స్పష్టం చేసింది. రష్యా సైన్యంపై పోరాటాన్ని,
ఆయుధాలు వదిలిస్తే.. చర్చలకు సిద్ధమే అంటూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలారోవ్ ప్రకటించారు. అయితే యుక్రెయిన్‌ను నియో-నాజీల తరహాలో పాలించడం మాస్కోకు సైతం ఇష్టం లేదని సెర్గీలారోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో
రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు యుక్రెయిన్‌ అధ్యక్షుడు స్పష్టం చేశారు. యూరప్‌పై జరుగుతున్న యుద్ధంగానే చూడాలని జెలెన్‌స్కీ పుతిన్‌కు సూచించారు. ఇది యుక్రెయిన్‌పై మాత్రమే జరుగుతున్న యుద్ధం కాదన్నారు. యుక్రెయిన్
పౌరుల ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

యుద్ధం ఆపాలంటూ యూరప్ వాసులంతా డిమాండ్ చేయాలని జెలెన్‌స్కీ సూచించారు. యుక్రెయిన్‌కు మిలటరీ, ఆర్థిక సాయం అందించేలా మీ దేశాలపై ఒత్తిడి పెంచాలని యుక్రెయిన్ అధ్యక్షుడు యూరప్ వాసులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
అమాయక ప్రజలు యుద్ధం కారణంగా చనిపోకుండా ఆపేందుకు చర్చలకు సిద్ధమని జెలెన్ స్కీ సూచించారు. ఇరు దేశాలు చర్చల ప్రస్తావన తేవడంతో యుద్ధం దాదాపు ముగింపు దశకు వచ్చినట్లే కనిపిస్తోంది. రష్యా-యుక్రెయిన్‌లు సయోధ్య దిశగా
అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుండటంతో ప్రపంచ దేశాలు సైతం ఊపిరి పీల్చుకుంటున్నాయి.

Read Also : Russia-Ukraine Crisis : రష్యా-యుక్రెయిన్ పేలుళ్ల మధ్య.. పెళ్లి ప్రమాణాలతో ఒక్కటైన జంట..!

ట్రెండింగ్ వార్తలు