Revanth Reddy: అప్పట్లోగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది: రేవంత్ రెడ్డి

బండి సంజయ్ మాటలకు, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ మాటలకు సారూప్యత ఉందని ఎద్దేవా చేశారు.

Revanth Reddy – Telangana: తెలంగాణలో నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 2023, డిసెంబర్ 9లోగా తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉంటుందని అన్నారు. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అప్పటి యూపీఏ ప్రభుత్వం ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ఇవాళ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఆ విషయాన్ని గుర్తు చేశారు. అలాగే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిరాశతో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. బండి సంజయ్ మాటలకు, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ మాటలకు సారూప్యత ఉందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. పోలీసులతో ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రశ్నించే వారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారని అన్నారు.

హజ్ యాత్రికులను కలవాలనుకున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీని గృహ నిర్బంధం చేశారని చెప్పారు. తెలంగాణ అమరవీరుల పోరాటాల చరిత్రతో అమరవీరుల స్థూపం ఉండాలని, వారి త్యాగాల వల్లే ఇప్పుడు కేసీఆర్ అధికారాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. తెలంగాణ అమరవీరులు 1,200 మంది అని ప్రభుత్వం చెప్పలేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు.

తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి శాసనసభ స్పీచ్ లో సీఎం కేసీఆర్ ఈ విషయం చెప్పలేదా? అని రేవంత్ నిలదీశారు. శాసనసభలో అమరవీరులపై ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాలను అవమానించేలా బీఆర్ఎస్ తీరు ఉందని అన్నారు.

అమరవీరుల స్థూపం నిర్మాణం కోసం నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి 6 శాతం డబ్బులు చెల్లించారని చెప్పారు. ఆ స్థూప నిర్మాణానికి 63,75,35,381 రూపాయలతో టెండర్లు పిలిచారని అన్నారు. ఆ తర్వాత అంచనా వ్యయం పెంచుకుంటూపోయారని, చివరకు రూ.179 కోట్ల 5 లక్షలకు పెంచారని తెలిపారు.

నూతన అమరవీరుల స్థూపంలో అమరవీరుల పేర్లను రాయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ పేరు ఎందుకు పెట్టాలని నిలదీశారు. తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. అమరవీరుల స్థూపాన్ని కట్టడానికి తొమ్మిదేళ్లు పట్టిందని విమర్శించారు. అమరవీరుల స్థూపంలో అమరవీరుల పేర్లు ఉండాలని అన్నారు.

CM KCR : మళ్లీ గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు, ఐటీ కంపెనీలు : సీఎం కేసీఆర్ వరాలు

ట్రెండింగ్ వార్తలు