Site icon 10TV Telugu

AP Corona Cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Ap Corona Cases

Ap Corona Cases

AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 896 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో ఆరుగురు కోవిడ్ తో మరణించారు. అదే సమయంలో ఒక్కరోజులో 8వేల 849 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24వేల 454 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 24గంటల వ్యవధిలో 24,066 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. శుక్రవారంతో (1,166) పోలిస్తే శనివారం కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో అనంతపురం జిల్లాలో ఇద్దరు కోవిడ్ తో చనిపోయారు. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14వేల 694కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,28,09,000 కరోనా టెస్టులు చేశారు.

అటు దేశవ్యాప్తంగానూ కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. తాజాగా కొత్త కేసులు 50 వేలకు దిగొచ్చాయి. శుక్రవారం 14 లక్షల మందికి కరోనా టెస్తులు చేయగా.. 50వేల 407 మందికి పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. ముందురోజు కంటే కేసులు 13 శాతం మేర తగ్గాయి. దాంతో పాజిటివిటీ రేటు 3.48 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు 6 లక్షల (1.43 శాతం)కు పడిపోయాయి. నిన్న ఒక్కరోజే 1,36,962 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ రెండేళ్ల వ్యవధిలో 4.25 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.14 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 97.37 శాతానికి పెరిగింది.

24 గంటల వ్యవధిలో 804 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. క్రితం రోజుతో పోలిస్తే మరణాల సంఖ్య (657) పెరిగింది. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 5,07,981 పెరిగింది. ఇక నిన్న 46 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 172 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

Exit mobile version