Heavy Rains Alert: నైరుతి బంగాళాఖాతం దాన్ని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే 24గంటల్లో తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ కోస్తా తీరం వెంబడి పయనించే అవకాశం ఉందని, ఈ కారణంగా తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. గడిచిన 24గంటల్లో విజయనగరం జిల్లా బొండపల్లిలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే, శుక్రవారంసైతం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా.. శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటి వర్షాలు కురవగా.. ఇవాళ నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, పశ్చిమగోదావరి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల వద్ద 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఏపీలో ఎడతెరిపి లేని వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పంటలు చేతికొచ్చే సమయం కావడం, ఈ సమయంలో వర్షాలు పడుతుండటంతో చేతికొచ్చిన పంట నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.