AP Rains: వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 12 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ మీదుగా పయనిస్తుంది. నైరుతు రుతుపవనాల ప్రవేశం తరువాత బంగాళాఖాతంలో ఏర్పడిన మొదటి అల్పపీడనం ఇదే. ఈ అల్పపీడనంతోపాటు రెండ్రోజుల నుంచి ఉపరిత ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Also Read: Ambati Rambabu: జగన్ అప్పగించిన బిగ్ టాస్క్ అంబటితో సాధ్యమయ్యేనా..?
ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు ఏపీలో ఈదురుగాలులతో కూడిన వానలు విస్తారంగా పడే అవకాశం ఉండటంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
‘అల్పపీడనం ప్రభావంతో ఇవాళ (శుక్రవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, శ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.’
నైరుతి రుతుపవనాల విస్తరణ మొన్నటి వరకు నెమ్మదిగా సాగింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని, ఆ తరువాత కూడా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.