Ambati Rambabu: జగన్ అప్పగించిన బిగ్ టాస్క్ అంబటితో సాధ్యమయ్యేనా..?
విడదల రజిని పేట కోటలో తిరిగి పట్టు సాధించేనా?

అభ్యర్థుల మార్పులు చేర్పులు. ఎన్నికలకు ముందు ఇదంతా కామన్. కానీ ఈ సారి ఇప్పటి నుంచే ఎలక్షన్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారు వైసీపీ అధినేత జగన్. నియోజకవర్గాల వారీగా ఇప్పటి నుంచే ఇంచార్జ్‌లుగా ఎవరిని పెడితే బాగుంటుందనే దానిపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆ పార్టీ అధినేత జగన్ పెద్ద భారం మోపారు.
గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అంబటికి కీలకమైన గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. టీడీపీకి కంచుకోటగా భావించే గుంటూరు వెస్ట్‌లో అంబటి అయితేనే నెగ్గుకు రాగలరని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2009లో ఏర్పడిన గుంటూరు వెస్ట్ సెగ్మెంట్‌లో ఒకసారి కాంగ్రెస్, ఆ తర్వాత వరుసగా టీడీపీ గెలిచాయి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి విడదల రజిని దాదాపు 50 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
Also Read: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేది అప్పుడేనా? ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్‌తో..
దీంతో ఆమెను తిరిగి చిలకలూరిపేట పంపిన జగన్, గుంటూరు వెస్ట్ బాధ్యతలను సీనియర్ నేత అంబటికి అప్పగించారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ చేతిలో దాదాపు 28వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అంబటి రాంబాబు. ఇలా ఆ రెండు నియోజకవర్గాల్లో సత్తా చాటలేని ఆ ఇద్దరి నేతలను సెగ్మెంట్లను మార్చారు జగన్. ఇప్పటికే విడదల రజినికి తిరిగి చిలకలూరిపేట ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు. సత్తెనపల్లిలో ఓడిన అంబటికి గుంటూరు వెస్ట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కల్పించారు వైసీపీ అధినేత.
66 ఏళ్ల వయసులోనూ దూకుడుగా..
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో బీసీలు అధిక సంఖ్యలో ఉండగా, వైశ్య, కమ్మ ఓటు బ్యాంకు కూడా ఎక్కువే. ఈ పరిస్థితుల్లో అంబటికి బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది. కృష్ణా జిల్లాకు చెందిన అంబటి దాదాపు నాలుగు దశాబ్దాలుగా గుంటూరు రాజకీయాలతో మమేకయ్యారు. 1988లో గుంటూరు నుంచే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో రేపల్లె నుంచి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిన అంబటి మళ్లీ రేపల్లె వైపే చూస్తున్నారన్న టాక్ వినిపించింది. కానీ గుంటూరు వెస్ట్ బాధ్యతలు ఇచ్చి చర్చకు దారి తీశారు వైఎస్ జగన్. అయితే సత్తెనపల్లిలో అంబటి స్థానికేతరుడు అన్న విమర్శలతో అక్కడ పార్టీ బలం పుంజుకోవడం లేదని అధిష్టానం ఆయనను సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించిందని అంటున్నారు.
సత్తెనపల్లిలో అంబటి స్థానంలో గుజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించింది. దీంతో అంబటికి గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలతో పాటు గుంటూరు వెస్ట్ సెగ్మెంట్ సమన్వయ కర్తగా నియమించారు జగన్. పార్టీ అధినేత ఏం చెప్పినా ఫాలో అయ్యే అంబటి కూటమి ప్రభుత్వంపై పోరాడుతున్న అతికొద్దిమంది వైసీపీ నేతల్లో ముందు వరుసలో ఉన్నారు. 66 ఏళ్ల వయసులోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే అంబటి ఎంత దూకుడుగా వెళ్లినా..ఆయనకు ఎంత వాక్చాతుర్యం ఉన్నా.. ఇప్పటివరకు వైసీపీ గెల్వని సీటులో సత్తా చాటగలరా అన్న డిస్కషన్ జరుగుతోంది. పైగా గుంటూరు వెస్ట్ అంటేనే టీడీపీ కంచుకోట అంటుంటారు. అలాంటి నియోజకవర్గంలో అంబటి ఎలా గట్టెక్కుతారో చూడాలి మరి.