మేం 11 మందే.. కానీ 1100 మందిలా భయం పుట్టించాం కదా.. పవన్ పై జగన్ ఫైర్
YS Jagan Press Meet : మాజీ సీఎం వైఎస్ జగన్ కాగ్ నివేదిక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు.
ys jagan mohan press meet about cag report about andhra pradesh
YS Jagan Press Meet: చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి రాబడులు తగ్గాయని, అప్పులు పెరిగాయని, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని.. కాగ్ నివేదికే దానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆదాయం తగ్గి, అప్పులు పెరిగాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తాను వెల్లడించిన విషయాలనే కాగ్ (CAG) కూడా బయటపెట్టిందన్నారు.
2023-2024లో ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 2,36,486 కోట్లు కాగా.. రాబడులు రూ. 1,70,767 కోట్లు అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ. 2,49,906 కోట్లు అని తెలిపారు. అదే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి వచ్చిన రాబడులు మాత్రం రూ. 1,68,024 కోట్లు మాత్రమే అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ. 60,285 కోట్లు అని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ లోటు 56 శాతం పెరిగిందన్నారు. అలానే ద్రవ్యలోటు 30 శాతం పెరిగిందని తెలిపారు.
రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్న వేళ కోవిడ్ మహమ్మారి విజృంభించిందని, ఆదాయాలు తగ్గాయని.. అయినా సరే తాము హామీలు నెరవేర్చామన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సీన్ మారిందని, అప్పులు అమాంతం పెరిగాయని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అప్పుల విషయంలో నెట్ బారోయింగ్ సీలింగ్ (Net Borrowing Ceiling) పరిధి దాటింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వరకు అప్పు తీసుకోవచ్చో కేంద్ర ప్రభుత్వం విధించే పరిమితే నెట్ బారోయింగ్ సీలింగ్ పరిధి. చంద్రబాబు హయాంలో అది దాటిందని పేర్కొన్నారు.
చంద్రబాబు అండ్ కో దోచిపెట్టడమే సరిపోతోందని.. మట్టి, ఇసుక, భూములు, లిక్కర్ ఇలా దేన్నీ వదలకుండా అన్నింటిలో దోపిడీకి పాల్పడుతున్నారంటూ జగన్ ఆరోపణలు చేశారు. వైజాగ్‌లో జరిగిన భూదోపిడీయే వీరి దోపిడీకి నిదర్శనమన్నారు. ఇలా చేస్తే ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది, ప్రజలకు సంక్షేమం ఎలా అందుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనకు, ఆయన బిల్డప్‌కు తేడా చూపించే మరో చరిత్ర ఇదని విమర్శించారు. అప్పుల విషయంలో ఒకవైపు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తూ.. మరోవైపు వాళ్లే పరిధికి మించి అప్పులు చేస్తారని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత వాటిని బయటపడకుండా దాచే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.
ఏపీలో 16 రోజుల పాటు నిర్వహించి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది ఏం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో తప్పుడు లెక్కలు.. సెలఫ్ డబ్బాలు తప్ప ఏం లేదు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కి జాకీలు వేసుకోవడమే సరిపోయింది. లోకేష్.. చంద్రబాబు కోసం జాకీలు వేశారు. తండ్రీకొడుకులిద్దరి కోసం పవన్ కల్యాణ్ జాకీలు వేసి లేపే ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు చేసిన మేలేం లేదన్నారు.కాగ్ రిపోర్టులో అప్పుల విలువ రూ. 81,082.51 కోట్లు కాగా.. అసెంబ్లీలో రూ. 60,485.40 కోట్లు అని వెల్లడించారని, ఈ రెండింటి మధ్య సుమారు రూ. 20 వేల కోట్ల వ్యత్యాసం ఉందన్నారు.
