Quantum Test Beds: ఏపీలో నూతన అధ్యాయం.. అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
ఈ రెండు కంప్యూటర్ల ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
Quantum Test Beds: ఏపీలో క్వాంటం నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. అమరావతిలో క్వాంటం ఫెసిలిటీస్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భారత్ లో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ఆయన ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా మేధా టవర్స్ లోని 1క్యూ క్వాంటం ఫెసిలిటీని చంద్రబాబు ప్రారంభించారు. ఈ రెండు క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించేలాగా సదుపాయం చేశారు. ఈ రెండు కంప్యూటర్ల ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మైనస్ 273 డిగ్రీల సెంటిగ్రేడ్ అతి శీతల ఉష్ణోగ్రతలో పని చేసే ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్లు క్వాంటం ఉపకరణాల తయారీ, పరిశోధనలలో కీలకం కానున్నాయి.
Also Read: లోక్ సభ స్థానాలు 850కి పెంపు..! ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయి?
ముఖ్యంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీని ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో అందుబాటులో ఉంచుతారు. ఇక దీని వల్ల క్వాంటం ఉపకరణాలు తయారు చేసే కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
ఈ రెండు క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలలో పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే వినియోగిస్తున్నారు. మేధా టవర్స్ లో క్యూబిటెక్ సంస్థ 1Q పేరుతో టెస్ట్ బెడ్ ఏర్పాటు చేయగా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1S పేరుతో సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో మరో టెస్ట్ బెడ్ ను నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్ డీవో లాంటి దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు పూర్తి సహకారం అందించాయి.
అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్ కోసం క్రయోజనిక్స్, ప్రెసిసన్ అలాగే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, క్వాంటం గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ పరికరాలు, సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇవి కేవలం క్వాంటం కంప్యూటర్ల తయారీకే కాకుండా రక్షణ, ఆరోగ్య, సెమీ కండక్టర్ తయారీ వంటి రంగాలకు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
