AP Govt Jobs : ఏపీలో భారీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 10,060 పోస్టులకు 4 దశల్లో నోటిఫికేషన్లు!
AP Govt Jobs : ఏపీలో జాబ్ క్యాలెండర్-2026 ప్రకారం.. మొత్తం 4 దశల్లో మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు
AP Govt Jobs
AP Govt Jobs : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. జాబ్ క్యాలెండర్-2026 అమలుపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని ఖాళీ పోస్టుల భర్తీపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన నియామక ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జాబ్ క్యాలెండర్-2026లో భాగంగా మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను 4 దశల్లో భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తొలి దశలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. మిగతా నియామకాలకు కూడా స్పష్టమైన షెడ్యూల్ను ఖరారు చేసింది. రెండో దశలో 3,168 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, కొన్ని సాంకేతిక కారణాలతో ఈ దశలో స్వల్ప ఆలస్యం జరిగినా ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నోటిఫికేషన్ తేదీని ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మూడో దశలో 2,388 పోస్టులు, నాలుగో దశలో 2,981 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రెండు దశలకు సంబంధించిన నోటిఫికేషన్లను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ఏపీప్రభుత్వం ప్రకటించింది.
హోంశాఖలో 2,225 ఖాళీ పోస్టుల భర్తీకి కూడా చర్యలు చేపట్టింది. పోలీసు, భద్రతా విభాగాల్లో అవసరమైన సిబ్బందిని నియమించి శాఖలను బలోపేతం చేయడంపై దృష్టిసారించనుంది.
గ్రూప్-1 పోస్టుల పెంపుపై పరిశీలన :
ఇదిలా ఉండగా, ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టుల సంఖ్య పెంపుపై కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ఈ అంశంపై మంత్రుల కమిటీ అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించే లక్ష్యంతో అవసరమైతే పోస్టుల సంఖ్య పెంచే అవకాశాన్ని కూడా టీడీపీ సర్కార్ పరిశీలిస్తోంది.
ఈ సందర్భంగా ప్రతి ఏడాది నిర్దిష్ట సమయానికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. నియామకాల్లో జాప్యం లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.
అలాగే, జాబ్ క్యాలెండర్-2026కు సంబంధించిన పూర్తి స్థాయి ఖాళీల వివరాలను వచ్చే కేబినెట్ సమావేశానికి సమర్పించాలని ఆదేశించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకు విస్తృత అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
