AP Weather Update : ఏపీకి వర్ష గండం.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..!
AP Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం, సోమవారం కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వంశధార, నాగావళి నదుల ఉద్ధృతిపై హెచ్చరికలు, జిల్లాల వారీగా వర్ష సూచనలేంటో చూద్దాం..
AP Weather Updates
- బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
- ఆదివారం, సోమవారం వానలే వానలు..
- ఉప్పొంగుతున్న వంశధార, నాగావళి..
- లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త
AP Weather Update : ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వర్షాలు జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తోంది..
శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసరాల్లో వాయుగుండంగా బలపడొచ్చని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఈ ప్రభావంతో ఆదివారం, సోమవారం కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది..
కోస్తాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన :
ఆదివారం కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక సోమవారం పోలవరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండగా, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా.
Read Also : YS Jagan-Arnab Cyclone : తుపాను బాధిత రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా? చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ ఫైర్!
ఉప్పొంగుతున్న నదులు.. అప్రమత్తంగా ఉండండి :
మరోవైపు, భారీ వర్షాల కారణంగా వంశధార, నాగావళి నదుల్లో నీటి ప్రవాహం పెరిగినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొంగిపొర్లుతున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రయత్నించకూడదని, నదుల్లో ఈతకు వెళ్లడం ప్రమాదకరమని స్పష్టం చేసింది.
శ్రీకాకుళం జిల్లాలో నమోదైన వర్షపాతం :
గురువారం సాయంత్రం 5 గంటల వరకు పలాసలో 40.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. కంచిలిలో 27 మి.మీ., మందసలో 24.5 మి.మీ., ఇచ్ఛాపురంలో 23.7 మి.మీ., పిన్నింటిపేటలో 17 మి.మీ. వర్షం కురిసింది.
వాతావరణంలో మారుతున్న పరిస్థితులను ప్రజలు తేలికగా తీసుకోవద్దని, అధికారుల సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనించాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే ప్రాంతాల ప్రజలు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సహాయం తీసుకోవాలి.
