Credit Card Due : క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా కట్టారా? ఉద్యోగులకు హైకోర్టు గుడ్ న్యూస్!
Credit Card Due High Court Judgment : వ్యక్తిగత క్రెడిట్ కార్డు బకాయిని ఆలస్యంగా చెల్లించారనే కారణంగా ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చట్టబద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
Credit Card Due High Court Judgment
Credit Card Due High Court Judgment : వ్యక్తిగత క్రెడిట్ కార్డు బకాయిని ఆలస్యంగా చెల్లించినందుకు ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చట్టబద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగి, బ్యాంకు మధ్య క్రెడిట్ కార్డు లావాదేవీ అనేది పూర్తిగా రుణదాత–రుణగ్రహీత మధ్య జరిగే వాణిజ్య ఒప్పందమేనని పేర్కొంది.
హైదరాబాద్కు చెందిన ప్రకాశ్ బాబు అనే వ్యక్తి 1979లో యూనియన్ బ్యాంకు (అప్పటి ఆంధ్రాబ్యాంకు)లో ప్రొబేషనరీ అధికారిగా బాధ్యతల్లో చేరారు. 30ఏళ్లు సేవలు బ్యాంకు ఉద్యోగిగా అందించారు. ఉద్యోగంలో ఉండగా బ్యాంకు జారీ చేసిన క్రెడిట్ కార్డును వినియోగించారు. రూ.లక్ష పరిమితి ఉన్న కార్డులో బకాయి పెరిగి రూ.1.68లక్షలకు చేరింది. శాఖాపరమైన విచారణ నిర్వహించిన బ్యాంకు అధికారులు.. క్రెడిట్ బిల్లు కట్టలేదనే నెపంతో సర్వీసు ఉన్నా 2009లో ఆయనపై కంపల్సరీ రిటైర్మెంట్ విధించారు. దీంతో 2012లో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు.
బలవంతపు పదవీ విరమణ చేసేలా బ్యాంక్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ను జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం విచారించింది. దీంతో మాజీ ఉద్యోగి ప్రకాశ్బాబుపై విధించిన కంపల్సరీ రిటైర్మెంట్ శిక్షను హైకోర్టు రద్దు చేసింది. ఆయనను సాధారణ పదవీ విరమణ వరకు సేవలో కొనసాగినట్లుగా పరిగణించాలని, సర్వీస్, పింఛన్, రిటైర్మెంట్కు సంబంధించిన అన్ని ప్రయోజనాలను ఎనిమిది వారాల్లో చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. అంతకుముందు బ్యాంక్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ప్రకాశ్ బాబు గతంలో అనేక సర్వీస్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని, విధుల్లో దుష్ప్రవర్తన నిరూపణ అయిన కారణంగానే ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
