Srinivasa Mangapuram Review : ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ రివ్యూ.. మహేష్ అన్న కొడుకు హీరోగా మెప్పించాడా?
Srinivasa Mangapuram Movie Review: మహేష్ బాబు అన్న కొడుకు హీరోగా పరిచయం అవుతున్నాడు అని తెలియడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసారు.
Srinivasa Mangapuram
Srinivasa Mangapuram Review : సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ కుమారుడు జైకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ఒకప్పటి బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడాని ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మాణంలో RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మోహన్ బాబు, కిక్ శ్యామ్, వాసుకి, నరేష్, బ్రహ్మాజీ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస మంగాపురం సినిమా నేడు జూలై 30న థియేటర్లలో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
తిరుపతిలో పెద్దిరెడ్డి(కిక్ శ్యామ్)బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. డబ్బు, పరువు గురించి ఆలోచించే మనిషి. అతన్ని చంపి ఎలాగైనా తిరుపతిని ఏలాలి అని నారాయణప్ప(వడ్లమాని శ్రీనివాస్) ట్రై చేస్తూ ఉంటాడు. తిరుపతికి కొత్తగా వచ్చిన శ్రీను(జైకృష్ణ) చూసిన మొదటి చూపులోనే పెద్దిరెడ్డి కూతురు మంగ(రషా తడాని)ని ఇష్టపడి, ఆమె వెనక పడి దగ్గరవుతాడు. కానీ మంగకు మరో వ్యక్తితో నిశ్చితార్థం అవ్వడంతో షాక్ అవుతాడు. అయినా కూడా శ్రీను మంగకు ప్రపోజ్ చేస్తాడు. కానీ మంగ నో చెప్తుంది. శ్రీను మంగను ఇబ్బందిపెట్టడం చూసి పెద్దిరెడ్డి తమ్ముడు అతన్ని కొట్టి చంపడానికి తీసుకెళ్తుంటే లక్ష్మీపతి(అజయ్) గ్యాంగ్ వీళ్ళ మీద దాడి చేస్తుంది. కానీ ఆ దాడిలో శ్రీను పెద్దిరెడ్డి తమ్ముడ్ని కాపాడతాడు.
పెద్దిరెడ్డి చెల్లి వరలక్ష్మి(వాసుకి) ఎంట్రీ ఇచ్చి శ్రీనుని తిరుపతిలో చూసి షాక్ అవుతుంది. అసలు శ్రీను ఎవరు? అతని గతం ఏంటి? వరలక్ష్మి ఎందుకు శ్రీనుని తిరుపతిలో చూసి షాక్ అవుతుంది? నిశ్చితార్థం అయిన మంగ శ్రీనుని ప్రేమిస్తుందా? లక్ష్మీపతి ఎవరు? కూతురు ప్రేమ గురించి తెలిసిన పెద్దిరెడ్డి ఏం చేస్తాడు? బళ్లారిని గడగడలాడించే వెంకటప్పయ్య నాయుడు(మోహన్ బాబు)కి శ్రీను కథకు సంబంధం ఏంటి? లక్ష్మీపతి ఎవరు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే…
సినిమా విశ్లేషణ..
మహేష్ బాబు అన్న కొడుకు హీరోగా పరిచయం అవుతున్నాడు అని తెలియడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసారు. ఇక అజయ్ భూపతి డైరెక్టర్ అనడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు కూడా ఈ సినిమా గురించి వరుసగా ట్వీట్స్ చేయడం, వీడియో చేయడంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూసారు.
ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ ప్రేమకథ. బాగా డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి కూతురు, ఓ అబ్బాయి ఆమె వెంట పడి ప్రేమించడం, పాటలు, కొన్ని సీన్స్ తో రొటీన్ గా సాగుతుంది. మంగకు నిశ్చితార్థం అవ్వడం, అయినా హీరో ప్రపోజ్ చేయడం నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి పెద్దిరెడ్డి చెల్లి ఎంట్రీ ఇచ్చి శ్రీనుని కలవడంతో అసలు శ్రీను ఎవరు అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో శ్రీను గతం, శ్రీను ఎవరు, వెంకటప్పయ్య నాయుడు కథతో మంచి ఎమోషన్స్, ఎలివేషన్స్ తో సాగుతుంది. క్లైమాక్స్ పెళ్లికి రెడీ అయిన మంగ శ్రీనుతో లవ్ లో పడుతుంది అని రొటీన్ ప్రేమకథలకు ఇచ్చే ఎండింగ్ ఇచ్చారు. కాకపోతే క్లైమాక్స్ పెద్దిరెడ్డి, వెంకటప్పయ్య నాయుడు ఎంట్రీలతో కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ రొటీన్ సీన్స్ తో సాగినట్టు అనిపిస్తుంది. మొదటి 40 నిమిషాల్లోనే మూడు పాటలు రావడం కథకు అడ్డంగా ఉన్నాయి అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నా రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ళు ఆ ట్విస్ట్ ని కనిపెట్టేస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో మోహన్ బాబు సీన్స్ మాత్రం వేరే లెవల్. ఫ్లాష్ బ్యాక్ లో ఎమోషన్ వర్కౌట్ అయింది. అసలు శ్రీను అంటే ఇష్టం లేని మంగ పెళ్లికి ముందు సడెన్ గా మారడానికి తగ్గ సీన్స్ పడలేదు, అంతగా లవ్ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ హెవీగా చూపించి ముగింపు సింపుల్ గా ఇచ్చారు అనిపిస్తుంది. ఇలాంటి కథతో గతంలోకి చాలా సినిమాలు వచ్చాయి. కానీ తిరుపతి బ్యాక్ డ్రాప్ లో కాస్త కొత్త కథనంతో కమర్షియల్ గా ట్రై చేసారు. ఘట్టమనేని ఫ్యాన్స్ అయితే జై కృష్ణ కోసం సినిమా చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్..
జైకృష్ణ మొదటి సినిమా అయినా తన నటనతో పర్వాలేదు అనిపించదు. డ్యాన్స్ బాగానే వేసాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో మాత్రం మెప్పించాడు. సినిమా కోసం బాగానే కష్టపడినట్టు కనిపిస్తుంది. బాలీవుడ్ భామ రషా తడాని అయితే ఎక్కడా కూడా తెలుగు అమ్మాయిలా కనిపించలేదు. కానీ అలా కనిపించడానికి కష్టపడింది. నటనతో పర్వాలేదు అనిపించింది. మోహన్ బాబు మాత్రం అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. చాన్నాళ్ల తర్వాత మోహన్ బాబుకి పవర్ ఫుల్ పాత్ర పడింది. ఆయన పాత్ర ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది.
నరేష్ పాత్ర బాగుంటుంది. అక్కడక్కడా నవ్వించారు నరేష్. కిక్ శ్యామ్ తొలిసారి తన కెరీర్లో భిన్నమైన పాత్ర పోషించారు. వాసుకి హీరోయిన్ అత్త పాత్రలో బాగానే నటించింది. అజయ్, వడ్లమాని శ్రీనివాస్, కిల్లి క్రాంతి కుమార్, మాస్టర్ మహేంద్రన్.. నెగిటివ్స్ షేడ్స్ లో మెప్పించారు. బ్రహ్మాజీ, ఆదర్శ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.
Also Read : Srinivasa Mangapuram : శ్రీనివాస మంగాపురం.. ఏ ఓటీటీలోకో తెలుసా?
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి కానీ చాలా సీన్స్ కలర్ గ్రేడింగ్ చేయలేదు అనిపిస్తుంది. తిరుపతిని చూపించే సినిమాల్లో తిరుపతి విజువల్స్ చాలా అందంగా ఉంటాయి. కానీ ఇందులో సింపుల్ గా కనిపిస్తాయి. తిరుపతి కాకుండా బళ్లారితో పాటు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చేసిన లొకేషన్స్ బాగున్నాయి. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్, ఓ పాట కట్ చేస్తే బెటర్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పవర్ ఫుల్ గా బాగానే ఇచ్చారు కానీ పాటలు యావరేజ్. రొటీన్ కథ, కథనాన్ని కొత్త ట్రీట్మెంట్ తో కమర్షియల్ గా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘శ్రీనివాస మంగాపురం’ కొత్త హీరోని పరిచయం చేయడానికి కమర్షియల్ గా తెరకెక్కిన ప్రేమకథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
