Cm Revanth Reddy: డీలిమిటేషన్ మంటలు.. మాకు అన్యాయం చేయొద్దు అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏకాభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్.
Cm Revanth Reddy: డీలిమిటేషన్ వ్యవహారం మంటలు రాజేసింది. లోక్ సభ సీట్ల పెంపు అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. లేఖలో ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, ఎంపీ సీట్ల పెంపును వేరువేరుగా చూడాలని లేఖలో కోరారు రేవంత్. హైబ్రిడ్ మోడల్ లో డీలిమిటేషన్ చేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
కానీ, ఎంపీ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు రేవంత్. కేంద్రం అనుసరిస్తున్న విధానం దేశ సమగ్రతకు ప్రమాదం అని తెలిపారు. డీలిమిటేషన్ పై జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏకాభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్.
కాగా, లోక్సభ సీట్ల పెంపునకు కేంద్రం సిద్ధమైంది. లోక్సభ సీట్లు 543 నుంచి 850కి పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు డ్రాఫ్ట్ కాపీని రూపొందించిన కేంద్రం అందరు ఎంపీలకు అందజేసింది. కేంద్రం ప్రతిపాదనల ప్రకారం లోక్సభలో ప్రస్తుతం ఉన్న 543 ఎంపీ సీట్లు 850కి పెరుగుతాయి. ఇందులో రాష్ట్రాల్లో 815 స్థానాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35 స్థానాలు కేటాయిస్తారు.
ఇదే సమయంలో చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను త్వరలోనే పార్లమెంట్లో ఆమోదింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లులు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 55, ఆర్టికల్ 81లను సవరించాలి. ఇది 131వ రాజ్యాంగ సవరణ అవుతుంది.
Also Read: 850కి పెరగనున్న ఎంపీ స్థానాలు..! కేంద్రం కీలక నిర్ణయం, లోక్ సభలో సీట్ల పెంపునకు ప్రతిపాదన
