Site icon 10TV Telugu

Water Warrior : బిహార్ బ్లైండ్ హీరో భుల్లు సాహ్ని.. 13 మంది ప్రాణాలను కాపాడిన జలయోధుడు.. రియల్ స్టోరీ..!

Bihar blind Man Bhullu Sahni

Bihar blind Man Bhullu Sahni

Water Warrior Blind Hero Bhullu Sahni : అతడో జలయోధుడు.. పుట్టినప్పటి నుంచి అంధుడు.. కానీ, నీటిలో చేపలా వేగంగా ఈదగలడు. ఎంతోమంది ప్రాణాలను రక్షించాడు కూడా. నీటిలో మృతదేహాలను సైతం బయటకు తీశాడు. అంగవైకల్యాన్ని శాపంగా భావించే వారికి స్ఫూర్తిగా నిలిచాడు.. అతడే 35ఏళ్ల భుల్లు సాహ్ని.. పుట్టుకతో కళ్లు కనిపించకపోయినప్పటికీ అద్భుతమైన సాహాసాలతో ఎంతోమంది ప్రాణాలను రక్షించి జలయోధుడిగా పేరుతెచ్చుకున్నాడు.

భుల్లు సాహ్ని.. సమస్తిపూర్ జిల్లా పటోరి బ్లాక్‌లోని దుమ్‌డుమా గ్రామానికి చెందిన కైలు సాహ్ని, కుసుమా దేవి దంపతుల కుమారుడు. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ, భుల్లు సాహ్ని మానవతా దృక్పథంతో జలయోధుడి బిరుదును సంపాదించుకున్నాడు.

Read Also : China HMPV Outbreak : చైనాలో వేగంగా విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్.. లక్షణాలు, నివారణ చర్యలేంటి?

13 మంది ప్రాణాలను రక్షించిన భుల్లు :
పుట్టినప్పటి నుంచి దాదాపు 90 శాతం కంటి చూపును కోల్పోయిన భుల్లు సాహ్ని.. ఈ ప్రాంతంలో అత్యుత్తమ ఈతగాడు, డైవర్ కూడా. గత 20 నుంచి 22 ఏళ్లలో నదులు, చెరువుల్లో మునిగిపోతున్న 13 మందిని సురక్షితంగా నీటిలో నుంచి బయటకు తీసి వారి ప్రాణాలను కాపాడి రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా నదులు, చెరువుల్లో మునిగి చనిపోయిన 13 మంది మృతదేహాలను వెలికితీసిన ఘనత అతడికే దక్కుతుంది. భుల్లు సాహ్నికి తన కళ్లు దాదాపు రావని వైద్యులు తేల్చేశారు. అయితే, తాను నీటిలోకి వెళ్ళినప్పుడు, అతను ప్రతిదీ అద్దంలా స్పష్టంగా చూడగలడు.

10ఏళ్ల వయస్సు నుంచే ఈత నేర్చుకుని.. :
ఈ అద్భుతమైన సామర్థ్యం కారణంగా, అతడు నది చెరువులలో డైవింగ్ చేసి మృతదేహాలను గుర్తించడంలో నైపుణ్యం సంపాదించాడు. దాదాపు 10ఏళ్ల నుంచి 12 సంవత్సరాల వయస్సులో ఈత కొట్టడం నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు అతన్ని ‘నీటి యోధుడు’ అని పిలుచుకుంటున్నారు. నీటిలో మునిగి చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీయడంలో, నీటిలో మునిగిపోయిన వారి ప్రాణాలను సురక్షితంగా రక్షించడంలో భుల్లా రికార్డు సృష్టించాడు. అంగవైకల్యం ఉన్నప్పటికీ అతని ఉత్సాహం, అద్భుతమైన పని సామర్థ్యం, మానవత్వం అతన్ని సామాన్య ప్రజల కన్నా చాలా ఉన్నత స్థానంలో నిలిపాయి.

కుటంబాన్ని పోషిస్తూ జీవనం :
కంటి చూపు లోపించినప్పటికీ కుటుంబ పోషణ నిమిత్తం రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు సంపాదిస్తున్నాడు. పెళ్లయిన కొన్నేళ్లకే భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ప్రస్తుతం అతని కుటుంబంలో తల్లి, తండ్రి, అన్నదమ్ములు, మేనల్లుడు, మేనకోడలు ఉన్నారు. దృష్టిలోపం ఉన్నప్పటికీ వారి పోషణకు ఆర్థిక సాయం చేస్తున్నాడు.

జోనల్ ఆఫీసులో వరదల సమయంలో జారీ చేసిన డైవర్ల జాబితాలో తన పేరు కూడా ఉందని, అయితే ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పటోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లగునియాలో ఉన్న చెరువులో మునిగిపోయిన వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత పోలీసులు తనకు రూ.1400 రివార్డ్ ఇచ్చారని భుల్లు సాహ్ని చెప్పాడు. అదే సమయంలో నీటిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీయగానే మండల కార్యాలయం నుంచి రూ.500 మాత్రమే ఇచ్చారు. సామాజిక స్థాయిలో ఇలాంటి పని చేసిన తర్వాత వారికి బాధిత కుటుంబ సభ్యులు కొంత ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇంత డబ్బుతో అతని కుటుంబ పోషణకు సరిపోదు.

చూపు లేకున్నా ఆపదలో ఉన్నవారిని రక్షిస్తాను :
మత్స్యకార కుటుంబానికి చెందిన భుల్లు సాహ్ని చిన్ననాటి నుంచి నదుల చుట్టూ పెరిగాడు. జిల్లా అంతటా అతడికి మంచి పేరు ఉంది. ‘నేను చూడలేకపోతే ఏం చేయాలి? నాకు దేవుడు ప్రసాదించిన నైపుణ్యాలు ఉన్నాయి. ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి నేను ఉపయోగిస్తాను’ అని భుల్లు సాహ్ని పేర్కొన్నాడు. భుల్లు సాహ్ని అత్త సుమిత్రా దేవి తన కొడుకు సకల్‌దీప్, కూతురు రూబీ కొన్నేళ్ల క్రితం చెరువులో స్నానం చేస్తుండగా.. అదే సమయంలో ఇద్దరూ మునిగిపోయారు. చుట్టుపక్కల వారి శబ్దం విని, సమీపంలో నిలబడిన భుల్లు సాహ్ని.. తన ప్రాణాలను పట్టించుకోకుండా, మునిగిపోతున్న పిల్లలిద్దరినీ సురక్షితంగా చెరువు నుంచి బయటకు తీశాడు.

భుల్లా తల్లి కుసుమా దేవి మాట్లాడుతూ.. తన కొడుకును  నీటిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీయమని పిలిచినప్పుడు చాలా భయంగానే అనిపించేదని తెలిపింది. అంగవైకల్యం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు చాలా మందికి సహాయం చేసాడు. భుల్లు సాహ్ని మాట్లాడుతూ.. తనకు ఎలాంటి ఆర్థిక సహాయం అందనప్పటికీ, తన ద్వారా కుటుంబంలో మళ్లీ వెలుగు రావడం సంతోషంగా ఉందన్నాడు.

Read Also : Blinkit Ambulance : బ్లింకిట్ సరికొత్త ఎమర్జెన్సీ సర్వీసు.. ఇకపై కేవలం 10 నిమిషాల్లోనే అంబులెన్స్..!

Exit mobile version