Site icon 10TV Telugu

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇవాళ, రేపు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

Weather UPdate

Weather UPdate

Telangana Heavy Rains: తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు ఊరించి మొఖం చాటేశాయి. దీంతో పెట్టిన విత్తనాలు మొలక రాక రైతులు నష్టపోతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మొలచిన మొక్కలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఎండలు, ఉక్కపోతతో సామాన్య ప్రజానీకంసైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్ర, శనివారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తెలంగాణలో గురు, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో సురక్షితంగా ఉండాలని, చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇవాళ (గురువారం) నల్గొండ , సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రేపు (శుక్రవారం) మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం లేదంటే రాత్రి తేలికపాటి వర్షం పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈనెల 19వ తేదీ వరకు అదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తూగడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Exit mobile version