Site icon 10TV Telugu

Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇవాళ సాయంత్రం ఆ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన.. హెల్ప్‌లైన్ ఫోన్ నంబ‌ర్లు ఇవే..

Hyderabad Rains

Hyderabad Rains

Hyderabad Rain Alert: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం, శుక్రవారం రాత్రి సమయాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది.

భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతోపాటు నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అప్రమత్తమైంది. నగర వాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే, శనివారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో.. అదేవిధంగా నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, వరంగల్, ములుగులోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


హైదరాబాద్‌లో మధ్యాహ్నం తరువాత మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పటాన్‌చెరు, ఇస్నాపూర్, అమీన్‌పూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలోని మిగిలిన ప్రాంతాలలో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం కూడా ఉందని, నగర ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

హెల్ప్‌లైన్ ఫోన్ నంబ‌ర్లు ఇవే..
ఎన్డీఆర్ఎఫ్ – 8333068536
ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ – 8712596106
హైడ్రా – 9154170992
ట్రాఫిక్ – 8712660600
సైబ‌రాబాద్ – 8500411111
రాచకొండ – 8712662999
టీజీఎస్పీడీసీఎల్ – 7901530966
టీజీఎస్ఆర్టీసీ – 9444097000
జీహెచ్ఎంసీ – 8125971221
హెచ్ఎండ‌బ్ల్యూఎస్ఎస్‌బీ – 9949930003

భారీ వర్షాల కారణంగా మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు సూచించారు. మరోవైపు రాజేంద్రనగర్‌ నుంచి హిమాయత్‌సాగర్‌ వైపు సర్వీస్‌ రోడ్డుపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సర్వీస్ రోడ్డు బ్రిడ్జిపై నుంచి భారీ వరద నీరు వెళ్తుండటంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపివేశారు. హిమయాత్ సాగర్ కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జలమండలి అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.

Exit mobile version