పదం నిషేధం : చాకలి అని పిలిస్తే జైలుకే

  • Publish Date - February 21, 2019 / 02:25 AM IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాకలి, చాకలోడు అనే పదాలను నిషేధించింది. ఇకపై బట్టలు ఉతకడాన్ని వృత్తిగా జీవిస్తున్న వారిని గౌరవిస్తూ రజకులని పిలవాలి. రజకులను కులం పేరుతో దూషిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాకలి, చాకలోడు అని పిలిస్తే జైలుకి పంపిస్తారు. ఆ పదాలు అవమానకరంగా ఉన్నాయని చెబుతూ వాటిని బ్యాన్ చేశారు. చాకలి, చాకలోడు అనే పదాలను నిషేధిస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి బుధవారం(ఫిబ్రవరి-21-2019) ఉత్తర్వులు జారీ చేశారు. చాకలి, చాకలోడు అనే పేర్లతో పిలిస్తే భారత శిక్షాస్మృతి-1860 ప్రకారం శిక్షార్హులవుతారని ఉత్తర్వుల్లో తెలిపారు.

రజకుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో రజకులను ‘చాకలి’, ‘చాకలోడు’ తదితర పేర్లతో పిలుస్తున్నారు. అలా పిలవడం వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని, తమ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని రజక వర్గాల నుంచి ఇటీవల ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. దీంతో ఆ పదాలపై నిషేధం విధించారు. కలెక్టర్లు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు