ఇసుక అక్రమ తవ్వకాల కేసు : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

  • Publish Date - May 9, 2019 / 09:12 AM IST

ఢిల్లీ : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల కేసులో రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్టీటీ) ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. నోటీసులు ఇవ్వకుండా, వాదనలు వినకుండా ఎన్జీటీ ఆదేశాలిచ్చిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఎన్జీటీ ఆదేశాలను సుప్రీంకోర్టు 3 నెలల పాటు నిలుపుదల చేసింది. 2 వారాల్లో ఎన్జీటీలో వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఏపీలో అసుక అక్రమ తవ్వకాలపై గతంలో ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి నివాసం ఉన్న ప్రాంతంలోనే అడ్డగోలుగా కొనసాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించారు. 

అధికార పార్టీ నేతలతో కుమ్మక్కైన ఇసుక మాఫియా ఏపీలోని కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదుల్లో ఇసుకను తోడేస్తోందని, సీఎం అధికారిక నివాసానికి సమీపంలో యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్లు లేఖలో వెల్లడించారు. తాము చేపట్టిన నదీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆ విధ్వంసాన్ని స్వయంగా చూసి దిగ్ర్భాంతికి గురైనట్లు తలిపారు. 

పర్యావరణ శాఖ నుంచి ఎలాంటి అనుమతలు లేకుండా వందలాది యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ, వేలాది ట్రక్కుల్లో తరలిస్తున్నారని తెలిపారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు స్థానికులు తమతో చెప్పారని లేఖలో వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు