Telangana CM Revanth Reddy
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అందులో ఏయే సిఫారసులున్నాయి? సర్కారు తదుపరి ఏ చర్యలు చేపట్టాలి? అన్న విషయాలపై కూడా రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవటంతో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులుపై ఎన్డీఎస్ఏ తెలంగాణ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సీఎంతో పాటు ఇతర మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని చెప్పారు.
రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని తోసిపుచ్చలేమని ఎన్డీఎస్ఏ నివేదికలో ఉందన్నారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం తెలిపారు.
రిపేర్లు చేయాలా లేదంటే ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? మరింత నష్టం జరగకుండా ఏయే చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.