Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వారందరికి రేషన్ బంద్ అవుతుందా..? క్లారిటీ ఇచ్చిన అధికారులు..
Ration Cards : తెలంగాణలోని రేషన్ కార్డు దారులందరు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రభుత్వం చెప్పింది.
Ration card
Ration Cards : తెలంగాణలోని రేషన్ కార్డు దారులందరు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రభుత్వం చెప్పింది. ఈ-కేవైసీ చేయడంతో నకిలీ రేషన్ కార్డులకు చెక్ పడుతుందని చెబుతున్నారు. అయితే, ఈకేవైసీ చేయించుకోని కార్డుదారులకు వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీ బంద్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు.. ఈకేవైసీ చేయించుకుంటే రేషన్ కార్డు రద్దు అవుతుందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ ఇచ్చారు.
Also Read : Telangana Govt : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి..
ఈ-కేవైసీ చేసుకోకుంటే రేషన్ బియ్యం నిలిపివేస్తారని, కార్డులు రద్దు అవుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆయన సూచించారు. ఈకేవైసీ ఎప్పుడైనా చేసుకోవచ్చని.. కానీ, చేసుకోవడం మాత్రం తప్పనిసరి అని గుర్తు చేశారు.
రేషన్ బియ్యం పంపిణీకి, ఈ-కేవైసీ ప్రక్రియకు ఎటువంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ ప్రక్రియ కేవలం లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించుకోవడానికి మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఎటువంటి గడువును విధించలేదు. లబ్ధిదారులు తమకు వీలైన సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చునని.. కానీ, తప్పని సరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచించారు.
కార్డులో పేరున్న ప్రతిఒక్కరూ కనీసం ఒక్కసారైనా రేషన్ షాపుకు వెళ్లి తమ వేలిముద్రలు లేదా ఐరిష్ గుర్తులను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది భవిష్యత్తులో పథకాల పారదర్శకతకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇదిలాఉంటే.. క్షేత్ర స్థాయిలో ఈ-కేవైసీ నిర్వహించే సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల వేలిముద్రలు బయోమెట్రిక్ యంత్రాల్లో సరిగ్గా పడటం లేదు. వేలిముద్రలు నమోదు కాని వారు ముందుగా ఆధార్ కేంద్రానికి వెళ్లి తమ బయోమెట్రిక్ వివరాలను, ఫోన్ నెంబర్లను అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వేలిముద్రలు అస్సుల పడని పక్షంలో ఐరిష్ ఆధారంగా కేవైసీ పూర్తిచేసే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది.
ఈ-కేవైసీ విధానం ద్వారా ప్రతి వ్యక్తి వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల సిస్టమ్ మరింత పటిష్ఘంగా, పారదర్శకంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్న పక్షంలో వారు ఉంటున్న ప్రాంతానికి సమీపంలోని రేషన్ డీలర్ ను సంప్రదించి కేవలం ఐదు నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయొచ్చు.
