Hyderabad: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. తక్కువ ఫీజుతో లోన్ ఇప్పిస్తానని 10లక్షలు వసూలు
ఫతేనగర్ బ్రిడ్జి దగ్గర నిందితుడు సాయి చంద్రను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఫోర్డ్ ఎండీవర్ కార్, ఐఫోన్, రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Representative Image (Image Credit To Original Source)
- తక్కువ ఫీజుతో భారీ మొత్తంలో లోన్ ఇప్పిస్తానని మాయమాటలు
- రూ.2.80 కోట్ల లోన్ ఇప్పిస్తానని రూ.10.69 లక్షల నగదు, 190 గ్రాముల బంగారం వసూలు
- నిందితుడిపై ఇప్పటికే 8 కేసులు
Hyderabad: కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నారు. మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. తక్కువ ఫీజుతో భారీ మొత్తంలో రుణాలు ఇప్పిస్తానని ఘరానా మోసానికి పాల్పడ్డాడో కేటుగాడు. హైదరాబాద్ రాంగోపాల్ పేట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని తురికెపల్లి భరత్ సాయి చంద్రగా గుర్తించారు.
తాను IDFC బ్యాంక్ ఉద్యోగినని సాయి చంద్ర ఓ మహిళను నమ్మించాడు. తక్కువ ఫీజుతో భారీ మొత్తంలో లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతడి మాటలను ఆ మహిళ నమ్మేసింది. తక్కువ ఫీజుతో లోన్ వస్తుందని ఆశ పడింది. ఆ మహిళ నుంచి నగదు, బంగారం వసూలు చేశాడు సాయి చంద్ర.
రూ.2.80 కోట్ల లోన్ ఇప్పిస్తానని చెప్పి ఆమె నుంచి రూ.10.69 లక్షల నగదు, 190 గ్రాముల బంగారం దోచుకున్నాడు. ఆ తర్వాత తప్పించుకుని తిరగడం స్టార్ట్ చేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు లబోదిబోమంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
ఫతేనగర్ బ్రిడ్జి దగ్గర నిందితుడు సాయి చంద్రను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఫోర్డ్ ఎండీవర్ కార్, ఐఫోన్, రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 160 గ్రాముల బంగారు బిస్కెట్ రికవరీ చేశారు. అలాగే అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.4 లక్షలు ఫ్రీజ్ చేశారు. కాగా, భరత్ సాయి చంద్ర పాత నేరస్తుడు అని, ఇప్పటికే అతడిపై 8 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
