Book LPG Cylinder : గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? మీకో బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఇకపై 21 రోజుల ముందు రీఫిల్ బుకింగ్ చేయలేరు.. ఎందుకంటే?
War impact: LPG గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ మారాయి. ఇప్పుడు రెండో సిలిండర్ వెంటనే బుకింగ్ చేయలేరు. ఇకపై 21 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ చేయగలరు.. ఎందుకంటే?
Book LPG Cylinder ( Image Credit : Gemini AI )
- గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై కొత్త రూల్స్ అమల్లోకి
- సిలిండర్ బుకింగ్ మధ్య గ్యాప్ 21 రోజులు ఉండాల్సిందే
- గతంలో సుమారు 15 రోజుల గ్యాప్, ఇకపై అలా ఉండదు
- ఇరాన్ యుద్ధం కారణంగా చమురు కంపెనీలు కీలక నిర్ణయం
Book LPG Cylinder : ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ మారాయి. వెంటవెంటనే గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకుంటామంటే ఇకపై కుదరదు. గ్యాస్ బుకింగ్ సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ కొత్త నియమాల ప్రకారం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ డెలివరీ తర్వాత మరో సిలిండర్ బుకింగ్ కోసం మధ్య 21 రోజులు గ్యాప్ కచ్చితంగా ఉండాల్సిందే.
అయితే, ప్రతి ఇంట్లో వంట గ్యాస్ అనేది నిత్యావసరంగా మారింది. లక్షలాది కుటుంబాలు వంట కోసం రోజువారీ పనుల వరకు ప్రతిదానికీ ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడుతున్నారు. గ్యాస్ సిలిండర్ లేకుండా ఇంట్లో పూట గడవని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కొత్త రూల్ వినియోగదారులకు ఇబ్బందిగా మారనుంది. ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు కంపెనీలు ఈ కొత్త రూల్ తీసుకొచ్చాయి.
21 రోజులు ఆగాల్సిందే :
అలాగే, చమురు కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశాయి. ఇప్పటినుంచి 21 రోజుల ముందు గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు. కొత్త నియమాలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. చమురు కంపెనీలు అన్ని గ్యాస్ ఏజెన్సీ ఆపరేటర్లను ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించాయి.
గతంలో, గ్యాస్ సిలిండర్ వినియోగదారులు తక్కువ వ్యవధిలో సిలిండర్లను రీబుక్ చేసుకునేవారు. కానీ, ఇప్పుడు ఎక్కువసేపు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇంధన మార్కెట్, సరఫరా నిర్వహణలో పెరుగుతున్న అనిశ్చితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త నిబంధనలను అనుసరించి గ్యాస్ వినియోగదారులు తమ గ్యాస్ వినియోగం విషయంలో కొద్దిగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ ప్రకారం.. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత డెలివరీ వ్యక్తికి డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) అందించడం ఇకపై తప్పనిసరిగా పేర్కొన్నారు. డెలివరీకి ఈ కోడ్ చాలా అవసరం. ఆ తర్వాత మాత్రమే సిలిండర్ డెలివరీ అవుతుంది. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్నప్పుడు ఈ కోడ్, ఓటిపీగా ఉపయోగపడుతుంది. టెక్స్ట్ మెసేజ్ ద్వారా వస్తుంది. ఈ కోడ్ డెలివరీ చేసే వ్యక్తికి చెప్పాల్సి ఉంటుంది.
సిలిండర్ బుకింగ్ రూల్స్ ఏంటి? :
గృహ ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ సంబంధించి గతంలో వినియోగదారులు సుమారు 15 రోజుల గ్యాప్ తర్వాత కొత్త సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ వ్యవధిని ఇప్పుడు 21 రోజులకు పొడిగించారు. ఒకసారి సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మరొక రీఫిల్‌ను బుక్ చేసుకునేందుకు కనీసం 3 వారాలు వేచి ఉండాలి.
సరఫరా వ్యవస్థను మెరుగ్గా నిర్వహించడమే ఈ మార్పు వెనుక ఉద్దేశమని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. డిమాండ్ అకస్మాత్తుగా పెరిగినప్పుడు పంపిణీ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని, అందుకే బుకింగ్ గ్యాప్ పెంచడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చునని అభిప్రాయపడుతున్నాయి.
బుకింగ్ రూల్స్ మార్చడానికి కారణం ఏంటి? :
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం సముద్ర వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరా గొలుసులపై ఒత్తిడిని పెంచింది. ప్రభుత్వాలు, చమురు కంపెనీలు ఇలాంటి పరిస్థితికి ముందుగానే సిద్ధం కావాలని భావిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడల్లా ప్రజలు సిలిండర్లను ఓవర్‌బుక్ చేస్తారు. దీన్నే పానిక్ బుకింగ్ అంటారు. ఇలా జరిగితే మార్కెట్లో అకస్మాత్తుగా గ్యాస్ కొరతకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు కొత్తగా 21 రోజుల గ్యాప్ రూల్ తీసుకొచ్చారు. తద్వారా అందుబాటులో ఉన్న స్టాక్‌ను అవసరమైన వారికి ఈజీగా డెలివరీ చేయొచ్చు అనమాట.
