Vijayasai Reddy : ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఎందుకంటే..? ఆసక్తికర విషయాలు చెప్పిన విజయసాయిరెడ్డి
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఎందుకు అవసరమో తెలియజేస్తూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు.
Vijayasai Reddy
Vijayasai Reddy : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 11వ తేదీన ఉదయం 11గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఎ-కన్వెన్షన్ లో కొత్త రాజకీయ పార్టీ పేరును ఆయన ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంకు అందర్నీ ఆహ్వానించారు. అయితే, తాజాగా.. ‘ఎక్స్’ వేదికగా విజయసాయిరెడ్డి ఆసక్తికర పోస్టు చేశారు. కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన మరికొన్ని కీలక అంశాలను ప్రకటించారు.
కొత్త రాజకీయ పార్టీ ఎందుకంటే.. ఏపీలో ఆ రెండు కుటుంబాలు, వాటి చుట్టూ ఉన్న కుటుంబాలు కాకుండా.. రాష్ట్రంలో కోటిన్నర కుటుంబాలు గౌరవప్రదంగా బతికేందుకు కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నాం. కోటిన్నర కుటుంబాల ఆదాయాన్ని పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు కొత్త పార్టీ పెడుతున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. అదేవిధంగా నామినేషన్లు కూడా వేయనీయకుండా ఏకగ్రీవాలు చేసుకోవటంలో రెండు పార్టీలు పోటీపడుతున్నాయి. ఎవరు అధికారంలో ఉంటే వారికి మన సమాజం మీద నిలువు దోపిడీకి లైసెన్సులు లభిస్తున్నాయి.. ఆ రెండు పార్టీల దోపిడీకి చెక్ పెట్టేందుకు కొత్త రాజకీయం అవసరమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రం అనే పంట పొలంలో కులపు విత్తనాలు ఒకరు, మత మార్పిడుల విత్తనాలు ఒకరు వేసి పంట పండించుకుంటున్నారు. కానీ, తాను స్థాపించబోయే కొత్త పార్టీలో సత్తాకలిగిన ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు.. ఎవరైనా మంత్రి, సీఎం కూడా కావచ్చు అని విజయసాయిరెడ్డి తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగం, చట్టం పనిచేయటం లేదు. బీహారుకు మించి పోలీసులు, పొలిటిషియన్లు, బ్యూరోక్రాట్లు కలిసి సమాజం మీదపడ్డారు. రెడ్ బుక్ పాలన ఇస్తాం అని ఒకరు.. రప్పారప్పా పాలన ఇస్తామని మరొకరు.. వారి 2029 ఎన్నికల ఎజెండాలను ఇప్పటికే డిక్లేర్ చేసేశారు.. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ఫ్యాక్షన్ల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమైనట్లు విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
పేద సామాజిక వర్గాల జీవితాలు మారాలంటే, వారికి చెపుతున్న చదువులు, వారికి వచ్చే ఉద్యోగాలు, ఈ రెండు పార్టీల నాయకత్వం పట్ల వారి ఆలోచనలు మారాలి. ఈ మార్పు కోసం కొత్త పార్టీ కావాలి. అందుకే ఈనెల 11వ తేదీన ఉదయం 11.11 గంటలకు ఏపీలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
మూడవ రాజకీయ ప్రత్యాయామ్నాయ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి తెలుగు ప్రజలందరికి హృదయపూర్వక ఆహ్వానం. https://t.co/Oxrbj1zT9S
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 8, 2026
