Cm Revanth Reddy: ఆ బాధ్యత మాదే..! మావోయిస్టు అగ్రనేత గణపతికి సీఎం రేవంత్ ఆఫర్..! బుల్లెట్ ను వదిలి బ్యాలెట్ ను పట్టాలని పిలుపు
శాంతియుత మార్గాల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని బలంగా నమ్మే దేశం మనది. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.
- రాష్ట్రంలో హింసకు తావు లేదు, హింస ద్వారా సమస్యలు పరిష్కారం కావు
- మావోయిస్టులపై ఉన్న కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం సిద్ధం
- ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి
Cm Revanth Reddy: బుల్లెట్ ను వదిలి బ్యాలెట్ ను పట్టాలని, ప్రజల్లో ఉండాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో హింస కుదరదని, హింస ద్వారా సమస్యలు పరిష్కారం కావని తేల్చి చెప్పారు. సమస్యలను ప్రజాస్వామ్యబద్దంగా పరిష్కరించుకుందామన్నారు. ఆయుధాలతో లొంగిపోతే మావోయిస్టులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని రేవంత్ కోరారు.
నక్సలైట్ల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందన్నారు. చట్ట పరిధిలో ఎత్తివేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నక్సలైట్లపై ఉన్న కేసులు ఎత్తివేసే అంశాన్ని పరిశీలించడానికి కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ICCC లో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ సమక్షంలో లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోయారని రేవంత్ తెలిపారు. వారి ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వారికి ఆర్థిక, ఇతర వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని వారిలో నమ్మకం కలిగించిన పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ అభినందించారు.
శాంతియుత మార్గాల ద్వారానే సమస్య పరిష్కారం..
”శాంతియుత మార్గాల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని బలంగా నమ్మే దేశం మనది. శాంతియుత పోరాటంతో మహాత్మా గాంధీ ఒక యుద్ధాన్ని జయించి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం. దేశాల మధ్య యుద్ధాలు జరిగితే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటున్న పరిస్థితి ఈరోజుల్లో ఉంది. అజ్ఞాతంలో ఉన్న గణపతితో సహా ఇతర మావోయిస్టులు కూడా లొంగిపోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిలుపునిస్తున్నా. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.
ఇటీవల లొంగిపోయిన దేవ్ జీ, దామోదర్, ఇతర కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమైనప్పుడు కొన్ని ప్రతిపాదనలు వారు నా ముందుంచారు. సెంట్రల్ కమిటీ ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లా. అత్యాధునిక ఆయుధాలతో 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలతో లొంగిపోయారు. బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా సమస్యలు పరిష్కరించాలని నమ్మి ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు.

Maoists Surrender Representative Image (Image Credit To Original Source)
2024 జనవరి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లకు మెరుగైన వైద్య సేవలు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. లొంగిపోయిన మావోయిస్టులకు మంచి ఆర్ధిక ప్యాకేజీని పెంచి ఇచ్చే అంశంపై త్వరలోనే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. గతంలో ఒకేసారి ఇంతమంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయిన దాఖలాలు లేవు. లొంగిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లతో పాటు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం” అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు సైత లొంగిపోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలోకి రావాలంటూ మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచించారు. గణపతి వయసు 70 ఏళ్లు ఉండొచ్చన్న సీఎం రేవంత్.. లక్ష్మణ్ రావు ఆరోగ్యం కూడా బాగోలేదని అధికారులు చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఆయనకు అవసరమైన సహకారం అందిస్తుందన్నారు. గణపతి సరెండర్ అయితే ఆయన పూర్తి భద్రత, బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read: సీఎం రేవంత్ సమక్షంలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు.. అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం
