Maoists Surrender: సీఎం రేవంత్ సమక్షంలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు.. ఏకంగా 130 మంది.. అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం
పీఎల్ జీఏ కమిటీకి చెందిన 130 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
- 130 మంది మావోయిస్టులు సరెండర్
- 124కి పైగా అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం
- లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్రయోజనాలు కల్పించనున్న ప్రభుత్వం
Maoists Surrender: తెలంగాణలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. 130 మంది మావోయిస్టులు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సరెండర్ అయ్యారు. వీరిలో తెలంగాణ, ఛత్తీస్ గఢ్ కి చెందిన మావోయిస్టులు ఉన్నారు. దేవ్ జీకి చెందిన పీఎల్ జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయినట్లు తెలుస్తోంది. 124కి పైగా తుపాకులు, మందుగుండు సామాగ్రిని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు మావోయిస్టులు.
మావోయిస్టులు పోలీసులకు అప్పగించిన అత్యాధునిక తుపాకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. పీఎల్ జీఏ కమిటీకి చెందిన 130 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 130 మంది మావోయిస్టుల్లో 125 మంది ఛత్తీస్ ఘడ్ కు చెందిన వారు ఉన్నారు, నలుగురు తెలంగాణకు చెందిన వారు, ఒకరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. గడిచిన రెండు నెలల్లో 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటీలో ఉన్న వారంతా సరెండర్ అయ్యారని తెలిపారు.
”తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒకరు రీజినల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు 124 తుపాకులను పోలీసులకు అప్పగించారు. ఒక INSAS LMG రైఫిల్, (31) AK-47 రైఫిల్స్, (21) INSAS రైఫిల్స్, (20) SLR రైఫిల్స్, (18) 303 రైఫిల్స్, 33 ఇతర తుపాకులను పోలీసులకు అప్పగించారు” అని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం కల్పించే పునరావాస ప్రయోజనాలు ఇవే..
తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానానికి అనుగుణంగా: –
డివిజనల్ కమిటీ సభ్యులు (DVCM) కు 5 లక్షలు
ఏరియా కమిటీ సభ్యులు (ACM) కు 4 లక్షలు
పార్టీ సభ్యుల (PM)కు ఒక లక్ష రూపాయల నగదు బహుమతి
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మారదర్శకాల ప్రకారం ఆయుధాలతో సహా జనజీవన స్రవంతిలో కలిసిన క్యాడర్లకు అదనంగా ప్రోత్సాహకాలు లభిస్తాయి.
”ఆయుధాలతో పాటు జనజీవన స్రవంతిలో కలిసిన 130 మంది మావోయిస్టులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహాయ పునరావాస విధానంలో అందాల్సిన రివార్డ్ మొత్తం 4 కోట్ల 18 లక్షల 20 వేలు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్ట్ క్యాడర్లకు పునరావాస విధానం కింద అదనపు సదుపాయాలు కూడా త్వరితగతిన కల్పిస్తాం. తద్వారా వీరంతా భద్రంగా తమ జీవితాన్ని పునః ప్రారంభించుకునేలా అవకాశం కల్పిస్తాం” అని రాష్ట్ర పోలీసు శాఖ హామీ ఇచ్చింది.
”భారీగా మావోయిస్టుల లొంగుబాటు వెనుక తెలంగాణ పోలీసుల కృషిని డీజీపీ శివధర్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పోలీసుల అంకితభావం, సమన్వయాన్ని మెచ్చుకున్నారు. వారి నిరంతర వృత్తిపరమైన కృషి వల్ల 130 మంది అజ్ఞాత CPI (మావోయిస్టు) క్యాడర్లు.. 124 తుపాకులు, 5205 తూటాలతో సహా జనజీవన స్రవంతిలోకి వచ్చారు” అని డీజీపీ తెలిపారు.
గణపతి భద్రత బాధ్యత మాదే..
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు సైత లొంగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలోకి రావాలంటూ మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచించారు. గణపతి వయసు 70 ఏళ్లు ఉండొచ్చన్న సీఎం రేవంత్.. లక్ష్మణ్ రావు ఆరోగ్యం కూడా బాగోలేదని అధికారులు చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఆయనకు అవసరమైన సహకారం అందిస్తుందన్నారు. గణపతి సరెండర్ అయితే ఆయన పూర్తి భద్రత, బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో కుబేరులు వీరే.. దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ.. ఈసారి 308 మంది..
