Taneti Vanitha: గోపాలపురం వైసీపీలో క్యాడర్ అసంతృప్తి రాగం..! మాజీమంత్రి తానేటి వనిత తీరుపై అసహనం ఎందుకు
గ్రూపు పాలిటిక్స్ ఆరోపణలతో 2024 ఎన్నికల్లో కొవ్వూరు సీటు తెచ్చుకోలేకపోయారు. తిరిగి గోపాలపురం వచ్చిన మాజీ హోంమంత్రి తానేటి వనితకు అక్కడ పరాభవం ఎదురైంది.
Taneti Vanitha Representative Image (Image Credit To Original Source)
- తానేటి వనిత క్యాడర్‌ను లైట్ తీసుకుని పార్టీని గాలికి వదిలేస్తున్నారా?
- సొంత పార్టీ నేతలే వనితపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారా?
- గ్రూప్‌వార్‌తో ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఆగమాగం..!
Taneti Vanitha: అధికారంలో ఉన్నప్పుడు పవర్‌ను ఎంజాయ్ చేశారు. ఇటు నియోజకవర్గంలో..అటు రాష్ట్రంలో మంత్రిగా హవా నడిపించారు. కట్ చేస్తే ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి మేడమ్ గారు మేడ దిగట్లేదట. ఎప్పుడో ఓసారి ఇలా వచ్చి అలా పార్టీ కార్యక్రమంలో పాల్గొని వెళ్లిపోతున్నారట. ఆ తర్వాత పార్టీని పెద్దగా పట్టించుకోవట్లేదట. దీంతో మాజీ హోంమంత్రి, నియోజకవర్గ ఇంచార్జ్ తీరుపై సొంత ఫ్యాన్ పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారట. ఓ వైపు అంతర్గత విబేధాలు, మరోవైపు గ్రూప్‌వార్‌తో ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఆగమాగం ఉందట. ఇంతకు ఏంటా నియోజకవర్గం? అక్కడ వైసీపీ పార్టీలో ఏం జరుగుతోంది?
నడిపించే నాయకులు లేరంటూ గోపాలపురం వైసీపీలో అసంతృప్తి..
పవర్ పోయింది. ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్లీ ఎప్పుడు అధికారంలోకి వస్తామో తెలియదు. అయినా సరే పోరాడేందుకు వెనకాడకుండా ముందుకెళ్తున్న కార్యకర్తలకు ..అండగా నిలిచే నాయకులు, నడిపించే రథసారధులు లేరంటూ గోపాలపురం వైసీపీలో క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతోందట. గతంలో టీడీపీలో పనిచేసి..ఆ తర్వాత వైసీపీ గూటికి చేరిన తానేటి వనిత మొన్నటి ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి సైలెంట్ మోడ్‌లో ఉండిపోతున్నారట. 2019లో కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచి, వరుసగా ఐదేళ్లు జగన్ క్యాబినెట్లో పనిచేశారు.
అయితే గ్రూపు పాలిటిక్స్ ఆరోపణలతో 2024 ఎన్నికల్లో కొవ్వూరు సీటు తెచ్చుకోలేకపోయారు. తిరిగి గోపాలపురం వచ్చిన మాజీ హోంమంత్రి తానేటి వనితకు అక్కడ పరాభవం ఎదురైంది. అయితే ఓడింది తాను కాదు పార్టీ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. క్యాడర్‌కు ధైర్యం చెప్పి, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సింది పోయి..తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారట.
ఇబ్బందుల్లో ఉన్న క్యాడర్‌ను, కేసుల పాలైన లీడర్లను పలకరించేదెవరు?
ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి తానేటి వనిత గోపాలపురం నియోజకవర్గంలో విసృతంగా పర్యటించిన దాఖలాలు లేవంటోంది క్యాడర్. మేడమ్ గారు మేడ దిగకపోతే.. సమస్యల్లో ఉన్న క్యాడర్‌ను, కేసుల పాలైన లీడర్లను పలకరించే నాథుడు ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు. తమ నాయకురాలిపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలు మొక్కుబడిగా నిర్వహించి..ఆ తర్వాత పెద్దగా ఎవరికీ టచ్‌లో ఉండటం లేదట.
ఇప్పటికే కొంతమంది నేతలు వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ నాయకురాలికి చెప్పుకుందామంటే ఆమె అందుబాటులో లేకపోవడంతో ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక ద్వితీయ శ్రేణి నేతలు ఢీలా పడిపోతున్నారట. మేడమ్ మేడ దిగి ప్రజల్లోకి రానప్పుడు..తాము ఎవరి కోసం ఎదురుచూడాలి అన్నది క్యాడర్ ఆవేదనగా చెబుతున్నారు.
మరోవైపు స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ..ఫుల్ యాక్టీవ్‌గా ఉంటున్నారు. వైసీపీ ఇంచార్జ్ తానేటి వనిత మాత్రం అందుబాటులో లేకపోవడంతో కొంతమంది నేతలు అధికార పార్టీ ఎమ్మెల్యేతో అంతర్గత దోస్తీ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అధికార పార్టీ వేధింపులకు గురవుతుంటే, కొందరు వైసీపీ లీడర్లు మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో నియోజకవర్గ ఇంచార్జ్ జీరో మార్కులు తెచ్చుకుంటుంటే, ద్వితీయ శ్రేణి నేతలు అధికార పార్టీతో అంటకాగడం క్యాడర్‌ను తీవ్రంగా బాధిస్తోందట. ఇది పార్టీకి వెన్నుపోటు పొడవడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బొక్కబోర్లా పడటం ఖాయం..!
ఎవరి దారి వారిదే అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తుండటం..సమన్వయం చేసే నాయకత్వం లేకపోవడంతో గ్రూపు పాలిటిక్స్ పీక్ లెవల్‌కు చేరాయని అంటున్నారు. త్వరలోనే కొంతమంది సైకిల్ ఎక్కడానికి రెడీ అవుతున్నారట. పరిస్థితి ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బొక్కబోర్లా పడటం ఖాయమని మండల స్థాయి నేతలు వైసీపీ హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. వెంటనే నియోజకవర్గ ఇంచార్జ్‌ను మార్చాలని కూడా కోరుతున్నారట. తమకు పని చేసే నాయకుడు, అందుబాటులో ఉండే లీడర్ కావాలని క్యాడర్ రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టకపోతే..గోపాలపురంలో ఫ్యాన్ గాలి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉందట. వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
