Sai Krishna Lockup Death : సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టులో సీబీఐ కీలక వ్యాఖ్యలు!
Sai Krishna Lockup Death : సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తునకు ఏపీ హైకోర్టు ఆదేశిస్తే మాత్రం తప్పకుండా దర్యాప్తు చేపడతామని సీబీఐ స్పష్టం చేసింది.
Sai Krishna Lockup Death
- సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తుపై ఏపీ హైకోర్టుతో సీబీఐ
- సీబీఐ దర్యాప్తు చేయాల్సినంత పరిస్థితులు లేవని వివరణ
- కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు
Sai Krishna Lockup Death : సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ సందర్భంగా సీబీఐ తన అభిప్రాయాన్ని ధర్మాసనం ముందుంచింది.
లాకప్ డెత్ కేసును తాము స్వయంగా దర్యాప్తు చేయాల్సినంత పరిస్థితులు లేవని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. కేసులో చోటుచేసుకున్న సంఘటనలు, జాతీయ లేదా అంతర్జాతీయ పర్యవసనాలకు దారితీసే స్వభావం లేవని, అందుకే ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది.
Read Also : YouTuber Ravan : రావణ్ కేసులో కీలక మలుపు.. హైకోర్టును ఆశ్రయించిన భార్య అనూష
అయితే, హైకోర్టు ఈ కేసును తమకు అప్పగిస్తూ దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే మాత్రం తప్పకుండా విచారణ చేస్తామని కూడా సీబీఐ పేర్కొంది. కానీ, దర్యాప్తు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహాయ సహకారాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించాలని సీబీఐ హైకోర్టును అభ్యర్థించింది.
కాగా, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ సొసైటీ ఫర్ కాన్స్టిట్యూషన్ రైట్స్ అధ్యక్షుడు గోచిపాక శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
