AP Government : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్‌కార్డులు ఉన్నవారికి మరో శుభవార్త..
AP Government : రేషన్ కార్డు దారులకు సర్కార్ మరో తీపికబురు చెప్పింది. రేషన్ షాపుల్లో త్వరలోనే రాయితీ కందిపప్పు, పామాయిల్ అందజేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
AP government
- ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- రేషన్‌కార్డులు ఉన్నవారికి మరో శుభవార్త..
- రాయితీపై కందిపప్పు, పామాయిల్
AP Government : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అంతేకాక.. రేషన్ కార్డు కలిగిన వారికి తక్కువ ధరలకే పలు రకాల సరుకులు అందించేలా ఏర్పాట్లు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఊరటనిచ్చేందుకు రేషన్ కార్డు దారులకు సబ్సిడీ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సబ్సిడీ బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి. అయితే, రేషన్ కార్డు దారులకు సర్కార్ మరో తీపికబురు చెప్పింది. రేషన్ షాపుల్లో త్వరలోనే రాయితీ కందిపప్పు, పామాయిల్ అందజేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో భాగంగా కాకినాడలో తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం విక్రయాలను మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. కాకినాడలోని మెయిన్‌రోడ్డు రామారావుపేటలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన కందిపప్పు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. ప్రతి రేషన్ కార్డుదారుకు 500 గ్రాముల కంది పప్పు అందించేందుకు ప్రతిపాదనలు చేశామని, కేంద్ర ప్రభుత్వం నుంచి 1లక్ష మెట్రిక్ టన్నుల కందులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని అన్నారు. ఆమోదం లభించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 30వేల ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో రేషన్ షాపులను మీ మార్ట్లుగా మారుస్తున్నామని, ఈ మీ మార్టుల్లో 64 రకాల నాణ్యమైన సరకులు విక్రయిస్తారని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా పది శాతం నూకలతో నాణ్యతతో కూడిన స్టీమ్ రైస్ పంపిణీ చేస్తామని.. రానున్న రెండు నెలల్లో ఈ ప్రక్రియను చేపడతామని, అదికూడా కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుదారులకు అందజేస్తామన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయని.. ఈ ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ద్వారా బియ్యం పంపిణీ చేస్తోందన్నారు. బీపీటీ స్టీమ్‌రైస్ కిలో రూ.52, బీపీటీ రా రైస్ కిలో రూ.50 చొప్పున అందిస్తున్నామన్నారు. ఐదు రోజుల్లో 14 వేల క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయించినట్లు మంత్రి ప్రకటించారు.
రేషన్ కార్డు లేనివారికి కూడా..
రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ఆధార్ ద్వారా తక్కువ ధరకే బియ్యం అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు తదితర నగరాల్లో ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
