Eiffel Tower Shut : BAPS పర్యటనతో వివాదం.. మహిళా ఉద్యోగులను పక్కన పెట్టారంటూ నిరసన.. ఈఫిల్ టవర్ మూసివేత!
Eiffel Tower Shut : హిందూ బాప్స్ బృందం ఈఫిల్ టవర్ సందర్శన సందర్భంగా మహిళా సిబ్బంది కనిపించకూడదంటూ ఆదేశాలు అందినట్టు ఆరోపణల నేపథ్యంలో అక్కడి సిబ్బంది నిరసన చేపట్టారు. ఈఫిల్ టవర్ తాత్కాలికంగా మూతపడింది.
Eiffel Tower Shut
- హిందూ బృందం పర్యటన.. ఈఫిల్ టవర్ సిబ్బంది సమ్మె
- BAPS పర్యటనతో వివాదం.. మహిళల హక్కులపై ఫ్రాన్స్‌లో దుమారం
- ఈఫిల్ టవర్ ఘటనపై ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రకంపనలు
Eiffel Tower Shut : ఈఫిల్ టవర్ ఘటనపై ఫ్రాన్స్‌లో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద హిందు బృందం పర్యటన నేపథ్యంలో మహిళా ఉద్యోగులను పక్కన పెట్టారన్న ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
ఈ ఘటనకు నిరసనగా టవర్ సిబ్బంది సమ్మెకు దిగారు. దాంతో ఒక రోజంతా ఈఫిల్ టవర్ మూసివేయాల్సి వచ్చింది. మంగళవారం నుంచి సాధారణ కార్యకలాపాలు కొనసాగుతాయని సిబ్బంది ప్రతినిధి తెలిపారు.
పారిస్ శివారులోని హిందూ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు BAPS (బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ) బృందం ఫ్రాన్స్‌కు వచ్చింది. సుమారు 100 మంది హిందూ గ్రూపు ప్రతినిధులు గత వారం ఈఫిల్ టవర్‌ను సందర్శించారు.
మహిళలను కనిపించొద్దని ఆదేశాలు జారీ :
ఈ పర్యటన సందర్భంగా మహిళా ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బందిలోని మహిళలను కొన్ని ప్రాంతాల నుంచి తప్పుకోవాల్సిందిగా, వారి స్థానాల్లో పురుషులను నియమించాలని ఆదేశించారని అక్కడి ఉద్యోగులు ఆరోపించారు.
మహిళలనే కారణం చూపి తమను పక్కన పెట్టేలా వృత్తిపరమైన ఆదేశాలు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని సిబ్బంది తీవ్రంగా మండిపడ్డారు. కొందరిని తమ పని ప్రదేశాల నుంచి ఇతర ప్రాంతాలకు పంపించారని, ప్రతినిధి బృందం ఉన్న సమయంలో కొన్ని మార్గాల్లో మహిళా ఉద్యోగులు వెళ్లకూడదని ఆదేశించినట్లు వెల్లడించారు.
Read Also : Tata Madhu : ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి నాంపల్లి కోర్టులో ఊరట.. రిమాండ్ తిరస్కరణ
ఈఫిల్ టవర్‌ను నిర్వహించే SETE సంస్థ సైతం పర్యటన సమయంలో మహిళలతో ఎక్కువగా మాట్లాడొద్దని హిందూ ప్రతినిధి బృందం కోరినట్లు తెలిపింది. అయితే, అలాంటి షరతులను తాము అంగీకరించకూడదని సంస్థ పేర్కొంది. ఈ చర్యలు సంస్థ విలువలకు, లింగ సమానత్వ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
ఆరోపణలను ఖండించిన బాప్స్ :
అయితే, BAPS ప్రకటనలో ఈ ఆరోపణలను ఖండించింది. పెద్ద సంఖ్యలో ప్రతినిధులు రావడంతో ఇతర సందర్శకులకు అంతరాయం కలగకూడదని ఈఫిల్ టవర్ యాజమాన్యంతో సమన్వయం చేసుకున్నామని తెలిపింది.
ఎవరికీ ప్రవేశం నిరాకరించలేదని పేర్కొంటూ ఈ పరిస్థితితో బాధపడిన వారికి క్షమాపణలు తెలిపింది. ఈ ఘటనపై పారిస్ మేయర్ ఇమ్మాన్యుయెల్ గ్రెగోయిర్ విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. ఫ్రాన్స్ మంత్రి ఆరోర్ బెర్జ్, మెరైన్ లే పెన్, గాబ్రియేల్ అట్టాల్ తదితరులు కూడా మహిళా సమానత్వాన్ని ప్రస్తావిస్తూ ఘటనను విమర్శించారు.
