TNR: విషాదం.. కరోనాతో జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ కన్నుమూత!

కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. రోజుకు లక్షలలో కేసుల నమోదుతో పాటు వేల మందిని పొట్టన బెట్టుకుంటుంది. ఇందులో తెలుగు ప్రముఖులు, జర్నలిస్టులు, నటులు సైతం ఉన్నారు. తాజాగా ప్రముఖ యూట్యూబ్‌ యాంకర్‌, జర్నలిస్ట్‌, నటుడు టీఎన్‌ఆర్‌ కరోనాతో కన్నుమూశారు.

TNR: కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. రోజుకు లక్షలలో కేసుల నమోదుతో పాటు వేల మందిని పొట్టన బెట్టుకుంటుంది. ఇందులో తెలుగు ప్రముఖులు, జర్నలిస్టులు, నటులు సైతం ఉన్నారు. తాజాగా ప్రముఖ యూట్యూబ్‌ యాంకర్‌, జర్నలిస్ట్‌, నటుడు టీఎన్‌ఆర్‌ కరోనాతో కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట ఆయన కరోనా బారినపడగా చికిత్స పొంది కోలుకుంటూ మళ్ళీ శ్వాస సంబంధ ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరి పోరాడి తుది శ్వాస విడిచారు. టీఎన్ఆర్ మల్కాజ్ గిరిలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని ఆదివారం ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే సోమవారం మరణ వార్త వినాల్సి వచ్చింది.

యూట్యూబ్‌ వేదికగా టీఎన్ఆర్ ఎంతో మంది సినిమా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. సూటి ప్రశ్నలతో అయన ఇంటర్వ్యూలు మెప్పించడంతో ఫుల్ డిమాండ్ ఉండేది. అంతేకాదు, నటుడిగానూ టీఎన్‌ఆర్‌ తనదైన ముద్రవేశారు. సుమంత్‌ హీరోగా ‘బోణి’ చిత్రంలో కనిపించేది కొద్దిసేపే అయినా మంత్రి పాత్ర పోషించారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జార్జిరెడ్డి’, ‘సుబ్రహ్మణ్య పురం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’తదితర చిత్రాల్లో నటించారు. టీఎన్‌ఆర్‌ మొదట దర్శకత్వంపై ఆసక్తితో 1992లో దేవదాస్‌ కనకాల వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నారు.

ఆ తర్వాత రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్‌ వద్ద సహాయకుడిగా పనిచేస్తూ పలు చిత్రాలకు రచనలో సహకారం అందించారు. తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని బుల్లితెర మీద పలు కార్యక్రమాలతో పాటు పలు న్యూస్‌ ఛానళ్లలో విలేకరిగా పనిచేశారు. టీఎన్‌ఆర్‌ అసలు పేరు తుమ్మల నరసింహారెడ్డి. టీఎన్‌ఆర్‌ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశాయి. ఆయన మరణవార్త విన్న పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ట్రెండింగ్ వార్తలు