Rahul Vijay Shivani Rajashekar Romantic Comedy Vidya Vasula Aham Movie Review
Vidya Vasula Aham Movie Review : తెలుగు ఓటీటీ ఆహాలో(Aha) రెగ్యులర్ గా కొత్త కొత్త షోలు, సినిమాలు వస్తూనే ఉంటాయి. తాజాగా నేడు మే 17 నుంచి ఆహా ఓటీటీలో ‘విద్య వాసుల అహం’ అనే సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్‌లు జంటగా ఎటర్నిటి ఎంట్రెర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మి నవ్య, రంజిత్ కుమార్ నిర్మాతలుగా మణికాంత్ గెల్లి దర్శకత్వంలో ఈ విద్యా వాసుల అహం సినిమా తెరకెక్కింది. భార్యాభర్తల మధ్య అహంతో గొడవలు వస్తే ఎలా ఉంటుంది అని ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘విద్య వాసుల అహం’ సినిమా తెరకెక్కింది.
కథ విషయానికొస్తే..
విద్య(శివాని), వాసు(రాహుల్ విజయ్) లకు పెళ్లి మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఓసారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ కార్యక్రమంలో చెప్పిన మాటలు విని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అవుతారు. అయితే విద్య పెళ్లిచూపులు కాకుండా నేను ఒక ఫామ్ రెడీ చేస్తాను మీకు నచ్చిన వాళ్లందరికీ పంపి వాటిని ఫిల్ చేసి తెప్పించండి, వాళ్లలో ఒకరినే ఫైనల్ గా సెలక్ట్ చేస్తాను అని పేరెంట్స్ కి చెప్తుంది. అలా ఒక ఫామ్ వాసు దగ్గరికి వస్తుంది. వాసుకి ఆ ఫామ్ ఇంట్రెస్ట్ గా అనిపించడంతో అమ్మాయి ఎవరో చూడకుండానే ఫిల్ చేసి పంపిస్తాడు. అలా వాసుని ఓకే చేయడంతో విద్య, వాసుల పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత కొత్త కాపురం పెట్టి క్యూట్ గా గడిపిస్తున్న సమయంలో డబ్బుల గురించి ఇద్దరి మధ్య గొడవ రావడం, అదే సమయంలో వాసు జాబ్ పోవడం, అదే సమయంలో ఇద్దరి పేరెంట్స్ ఇంటికి రావడం.. ఇలాంటి పలు సంఘటనలతో విద్య వాసుల మధ్య గొడవలు జరుగుతాయి. మరి ఇద్దరిమధ్య వచ్చే గొడవలు ఏంటి? ఇద్దరికీ గొడవలు వస్తే ఎవరు తగ్గారు? వాసు జాబ్ పోతే విద్య ఏం చేసింది? పేరెంట్స్ ముందు ఈ కొత్త జంట ఎలా ఉన్నారు? కొత్త జంట కలహాలకు ఎలా ముగింపు ఇచ్చారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ..
ఇటీవల కాలంలో రొమాంటిక్ కామెడీ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ‘విద్య వాసుల అహం’ సినిమా ఒక మంచి రామ్ కామ్ సినిమా అని చెప్పొచ్చు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు. పెళ్ళైన ఈ జనరేషన్ కొత్త జంట ఎలా ఉంటుంది అని పర్ఫెక్ట్ గా చూపించారు. సినిమాని మాములు కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మి దేవి, నారదుడు పెళ్లి కథల గురించి మాట్లాడుకోవడం చూపించి స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకున్నారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చారు అనిపిస్తుంది. ఇక కథ ఎక్కువగా టైటిల్ కి తగ్గట్టు కేవలం భార్యాభర్తల మధ్యే చూపించారు. మొత్తంగా ఒక క్యూట్ రామ్ కామ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్..
రాహుల్ విజయ్ ఈ జనరేషన్ కొత్త పెళ్ళికొడుకుగా మెప్పించాడు. ఇక ఈ సినిమాకు శివాని రాజశేఖర్ చాలా ప్లస్ అయింది. సినిమా అంతా చీరలో పద్దతిగా కనిపించి ఒక పెళ్ళైన కొత్త అమ్మాయిలా క్యూట్ గా కనిపిస్తూ ఓ పక్క రొమాంటిక్ సీన్స్ లో, మరో పక్క భర్తతో గొడవ పడే సీన్స్ లో అదరగొట్టేసింది అని చెప్పొచ్చు. సినిమాలో ఈ రెండే మెయిన్ క్యారెక్టర్స్. మిగిలినవన్నీ సందర్భానుసారం వస్తూ పోతూ ఉంటాయి. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు.
సాంకేతిక అంశాలు..
‘విద్య వాసుల అహం’ సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేసింది. కొత్త జంట కొత్త కాపురం పెట్టినప్పుడు కొత్త ఇంటిని బాగా డిజైన్ చేసారు. కళ్యాణ్ మాలిక్ ఇచ్చిన మెలోడీ సంగీతం బ్యూటిఫుల్ గా ఉంది. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. డైలాగ్స్ కూడా బాగా రాశారు. దర్శకుడిగా మణికాంత్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా కూడా ఎక్కడా తగ్గకుండా క్వాలిటీగా సినిమాని నిర్మించారు.
మొత్తంగా ‘విద్య వాసుల అహం’ సినిమా ఒక క్యూట్ రొమాంటిక్ కామెడీ సినిమా. ఆహా ఓటీటీలో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
https://www.youtube.com/watch?v=LcwtMtyh7CQ
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.