Vyommitra : ఇస్రో సంధించే వ్యోమమిత్ర ఎవరో తెలుసా?

హలో నా పేరు వ్యోమమిత్ర... అంటూ సాక్షాత్తూ ఇస్రో ఛైర్మన్ ఇస్రో చైర్మన్ శివన్‌తో ముద్దుగా మాట్లాడుతున్న ఈమె ఎవరో తెలుసా? మనిషి మాత్రం కాదు...మనిషి రూపంలో ఉన్న హ్యూమనాయిడ్ రోబో....

ISRO's female robot

Vyommitra : హలో నా పేరు వ్యోమమిత్ర… అంటూ సాక్షాత్తూ ఇస్రో ఛైర్మన్ ఇస్రో చైర్మన్ శివన్‌తో ముద్దుగా మాట్లాడుతున్న ఈమె ఎవరో తెలుసా? మనిషి మాత్రం కాదు…మనిషి రూపంలో ఉన్న హ్యూమనాయిడ్ రోబో. అంతరిక్షంలోకి గగన్ యాన్ ప్రయోగం కోసం తయారైన వ్యోమమిత్ర. చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఏడాది అక్టోబర్‌లో గగన్‌యాన్‌ మిషన్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సమాయత్తమైంది. అక్టోబర్‌ మొదటి లేదా రెండో వారంలో గగన్‌యాన్‌ తొలి ట్రయల్‌ రన్‌ను ఇస్రో చేపట్టనుందని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి జితేందర్‌ సింగ్‌ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రయోగంలో మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షంలోకి ఇస్రో పంపించనుంది. అచ్చు మనిషిలాగే అన్ని కార్యక్రమాలు నిర్వహించగలిగే సత్తా ఉన్న ఈ మహిళా రోబో ప్రయోగం విజయవంతం అయితే ఇక వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించవచ్చునని ఇస్రో భావిస్తోంది. ఇటీవల బెంగళూరులోని ఇస్రోలో జరిగిన సదస్సులో వ్యోమమిత్ర రోబో స్వయంగా మాట్లాడింది. వినూత్న మహిళా రోబో వ్యోమమిత్ర గురించి విశేషాలు తెలుసుకుందాం.

గగన్‌యాన్ ప్రయోగంపై ఆసక్తి

చంద్రుడిపై మొట్టమొదటిసారి దక్షిణ ధ్రువంపై కాలు మోపి ఇస్రో చారిత్రక విజయాన్ని సాధించింది. అతి తక్కువ బడ్జెట్‌తో ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయం పట్ల దేశ, విదేశాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరిన్ని ప్రయోగాలకు ముందడుగు వేస్తోంది. ఇస్రో అంతరిక్షంలోకి మనుషులను పంపాలనే లక్ష్యంతో చేపడుతున్న గగన్‌యాన్ ప్రయోగంపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. గగన్‌యాన్ ప్రయోగాన్ని 2022 ఏడాదిలోనే అంతరిక్షంలోకి పంపించాల్సి ఉన్నా.. కొవిడ్ మహమ్మారి కారణంగా అది ఆలస్యం అయింది.

మహిళా రోబోతో శాస్త్రవేత్తల ముచ్చట్లు

భారతదేశం రాబోయే గగన్‌యాన్ మిషన్ కోసం వ్యోమమిత్ర అనే మహిళా రోబోను రూపొందించారు. ఈ మిషన్ ట్రయల్స్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. స్త్రీ వేషధారణతో ఉన్న మానవరూప రోబోట్ వ్యోమమిత్ర అంతరిక్షంలో ప్రయాణించనుంది. ఈ మహిళా రోబోను 2020వ సంవత్సరం జనవరి నెలలో జరిగిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్… ప్రెజెంట్ ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్ ట్రెండ్స్ ఈవెంట్ ప్రారంభ సెషన్‌లో ఆవిష్కరించారు. ఈ సింపోజియంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొని రోబోతో మాట్లాడారు. ఈ రోబోను తిరువనంతపురంలోని ఇస్రో యొక్క ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్‌లో రూపొందించారు.

వ్యోమమిత్ర అంటే ఎవరు?

వ్యోమ అంటే అంతరిక్షం, మిత్ర అంటే స్నేహితురాలు అనే రెండు సంస్కృత పదాల కలయికతో వ్యోమమిత్ర మహిళా రోబోను మానవరహిత గగన్‌యాన్ మిషన్ కోసం రూపొందించారు. ఈ రోబోకు కాళ్లు లేకపోవడంతో దీనికి హాఫ్ హ్యుమనాయిడ్ రోబో అని పేర్కొన్నారు. ఈ రోబోట్‌ను తుంబా నగరంలోని ఇస్రో ఫెసిలిటీ సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటరు నిర్మించింది. ఈ రోబో రూపకల్పనను ఇస్రో ఇనర్టియల్ సిస్టమ్స్ యూనిట్ చేపట్టింది. ఐఐఎస్‌యూకి చెందిన ప్రత్యేక బృందాలు ఈ రోబో నావిగేషనల్ సిస్టమ్ ను రూపొందించే పనిలో ఉన్నాయి.

వ్యోమమిత్ర సృష్టికర్త ఎవరంటే…

వ్యోమమిత్ర రోబోను దయాల్ అనే శాస్త్రవేత్త సృష్టించారు. ఈ రోబో ముందుకు, పక్కకు మాత్రమే వంగగలదని దయాల్ చెప్పారు. ఇస్రో కమాండ్ సెంటరుతో టచ్‌లో ఉండి అంతరిక్షంలో పరీక్షలు నిర్వహించనుంది. ఈ రోబో వ్యోమగాములు చేయాల్సిన పనులను చేస్తూ రెండు భాషల్లో ప్రతిస్పందించనుంది. స్విచ్ ప్యానెల్‌లను ఆపరేట్ చేస్తోంది. ఈ రోబోకి ఇప్పటికే గుర్తింపు కార్డు ఉంది. ఈ గుర్తింపు కార్డు డిసెంబర్ 2023 వరకు చెల్లుబాటు కానుంది.

ఇస్రోకు నివేదిక పంపనున్న రోబో

ఈ రోబోకు సగం హ్యూమనాయిడ్… అంటే దీనికి కాళ్లు లేవు. అయినప్పటికీ రోబో ఇంటరాక్టివ్‌గా ఉంటుంది. ఉష్ణోగ్రత, పీడన స్థాయిలు, ఆక్సిజన్ లభ్యతతో సహా మాడ్యూల్‌లోని సిస్టమ్‌లను తనిఖీ చేయడంలో సహాయం చేయగలదు. గ్రౌండ్ స్టేషన్‌తో కమ్యూనికేట్ చేయడానికి రోబోకు స్వయంప్రతిపత్తి ఉంటుంది.గగన్‌యాన్ ప్రయోగం దీర్ఘకాల లక్ష్యమైన ఇంటర్ ప్లానెటరీ మిషన్ కు ఉపయోగపడుతుందని ఇస్రో భావిస్తోంది. గగన్‌యాన్ మిషన్ లో 10 టన్నుల పేలోడ్ సామర్థ్యం ఉన్న లాంఛర్ ను రూపొందించారు. ఈ హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ తన నివేదికను అంతరిక్షం నుంచి ఇస్రోకు పంపనుంది.

వ్యోమగాములకు శిక్షణ

చంద్రుడిపైకి మనుషులను పంపించే ప్రాజెక్టును చేపట్టాలనే లక్ష్యంతో ఇస్రో కార్యక్రమాలు చేపట్టింది. చంద్రుడిపై పంపించేందుకు ముగ్గురు వ్యోమగాములను ఎంపిక చేసి వారిని శిక్షణ కోసం రష్యాకు పంపించాలని నిర్ణయించారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి సురక్షితంగా పంపించడం ఎంత ముఖ్యమో.. అంతే సురక్షితంగా వారిని తిరిగి మళ్లీ భూమిపైకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. 1984వ సంవత్సరంలో రష్యా అంతరిక్ష నౌకలో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. మళ్లీ ఈ సారి ఇస్రోనే భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించేందుకు సమాయత్తం అవుతోంది. అంతరిక్ష యానం చేసిన 12 మంది వైమానిక దళ టెస్ట్ పైలట్లలో నలుగురిని ఎంపిక చేశారు. ఈ ఏడాది నవంబరు నుంచి 15 నెలల పాటు వీరికి శిక్షణ ఇవ్వనున్నారు.

గగన్‌యాన్ ప్రాజెక్టు మూడు దశలు…

గగన్‌యాన్ మూడు దశల్లో చేపట్టనున్నారు. దీనిలో భాగంగా 7 రోజుల పాటు వ్యోమగాములను ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించనున్నారు. మానవుడు అంతరిక్షంలో నివశించేందుకు వీలుగా కొత్త స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని ఇస్రో యోచిస్తోంది. 2024 వసంవత్సరం ఆఖరు నాటికి ఇస్రో గగన్ యాన్ ప్రయోగంలో భాగంగా మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో పరిశోధనలు చేస్తోంది. ముగ్గురు వ్యోమగాములను మూడు రోజుల పాటు అంతరిక్ష ప్రయాణం చేపట్టేలా ప్రయత్నాలు ఆరంభించారు. గగన్‌యాన్ ప్రాజెక్ట్ మూడు రోజుల మిషన్ కోసం ముగ్గురు సిబ్బందిని 400 కిలోమీటర్ల కక్ష్యలోకి పంపనుంది. వ్యోమగాములను సురక్షితంగా గ్రహానికి పంపించి, తిరుగు ప్రయాణంలో వారు హిందూ మహాసముద్ర జలాలపై దిగనున్నారు.

ట్రెండింగ్ వార్తలు